అందనిధి! | - | Sakshi
Sakshi News home page

అందనిధి!

Jul 3 2026 12:11 AM | Updated on Jul 3 2026 12:11 AM

కొత్త విధానం కొరివి పెట్టింది.. కాంట్రాక్టు ఉద్యోగులకు ఆకలి కేకలు తెచ్చింది.. ప్రభుత్వ రూపొందించిన విధానంలో లోపాల కారణంగా వేతనాల విడుదలకు జాప్యం జరుగుతోంది.. సమస్య ఉత్పన్నమై ఐదు నెలలు అవుతున్నా, చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన నిధి పోర్టల్‌ సక్రమంగా పనిచేయక ఉమ్మడి జిల్లాలోని సుమారు పది వేల మంది ఉద్యోగులకు ఇబ్బంది ఎదురవుతోంది.

సత్వరమే చెల్లించాలి

రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు సత్వరమే వేతనాలు మంజూరు చేయాలి. నిధి పోర్టల్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని పరిష్కరించాలి. పర్మినెంట్‌ ఉద్యోగుల మాదిరిగానే తమకు ప్రతి నెలా వేతనాలు అందించి, ఆర్థిక భరోసా కల్పించాలి.

– డి.సుగుణ, ఫార్మాసిస్టు, పెదపళ్ల, ఆలమూరు

లోపాలు పరిష్కరిస్తున్నాం

నిధి పోర్టల్‌లో సాంకేతిక లోపాలను పరిష్కరించే పనిలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం బకాయి పడిన వేతనాలకు సీఎంఎఫ్‌ఎస్‌ విధానంలోనే జూన్‌ వరకూ జీతాలు అందించాలని సూచించింది. కాంట్రాక్టు ఉద్యోగులకు వారం రోజుల వ్యవధిలోనే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

– బి.రామనాథం,

డీటీఓ ఇన్‌ ట్రెజరీస్‌, ముమ్మిడివరం.

ఆలమూరు: గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రతి శాఖలోని ఉద్యోగికి ఠంచనుగా ఒకటో తేదీనే జీతాలు పడేవి. చంద్రబాబు సర్కారులో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ప్రతి నెలా ఒకటో తేదీన అందాల్సిన వేతనాలు ఐదు నెలల నుంచి రాకపోవడం అయోమయానికి గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల మంజూరు కోసం రూపొందించిన నిధి పోర్టల్‌ సక్రమంగా పనిచేయక వచ్చిన సమస్య ఇది. ఫలితంగా విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, పంచాయతీరాజ్‌ తదితర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాల ఊసే లేకుండా పోయింది. ఇలాగైతే కుటుంబాలు ఎలా గడుస్తాయనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్రలోకి జారుకుంది. ఉద్యోగుల దయనీయస్థితిని పట్టించుకోవాల్సిన యంత్రాంగం మౌనం వహిస్తోంది. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు పది వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 3,500, కోనసీమలో 2,500, కాకినాడ జిల్లాలో 4 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఇరుకున పెట్టేందుకే ప్రభుత్వం నిధి పోర్టల్‌ తెచ్చిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.

వివరాలు ఎక్కడ బాబూ!

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇతర కాంట్రాక్టు ఉద్యోగులకు గతంలో సీఎఫ్‌ఎంఎస్‌ విధానం ద్వారా వేతనాలను మంజూరు చేసే పరిస్థితి ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేవలం కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రం ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నిధి పోర్టల్‌ ద్వారా వేతనాలు అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 14న రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఆ పోర్టల్‌లో ఉద్యోగుల వివరాలు, ఆధార్‌ ఈ–కేవైసీ, పోస్టుల మంజూరు వివరాలను నిక్షిప్తం చేయాలి. అనంతరం, ట్రెజరీ ఆమోదం తీసుకోవాలి. అందులో ఏది సక్రమంగా లేకపోయినా వేతనాల బిల్లు రూపొందే అవకాశం లేదు. ఐదో నెల పూర్తయినా ఇంకా నిధి పోర్టల్‌లో ఉత్పన్నమైన సాంకేతిక సమస్యలను పరిష్కరించడం లేదు. దీంతో ఈ పోర్టల్‌ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. దీనివల్ల ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకూ ఐదు నెలల నుంచి ఉద్యోగులకు వేతనాలు అందలేదు.

ఆర్థిక ఇబ్బందుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు

అరకొర వేతనాలతో చాకిరి చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలు అందక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. జూలై నెల ప్రవేశించినా తమ పిల్లలకు ఇంకా పుస్తకాల కొనుగోలు, స్కూల్‌ ఫీజులు చెల్లించలేని పరిస్థితి వారిలో నెలకొంది. ఇంటి అద్దె, బ్యాంకు రుణాల చెల్లింపులు, వైద్య ఖర్చులు, నిత్యావసరాల కొనుగోలు వంటి అంశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి కాంట్రాక్టు ఉద్యోగులకు ఉత్పన్నమైంది. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు వేతనాలు ఇవ్వకుండా ఇటువంటి దుస్థితి కల్పించడమేంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న వాగ్దానాన్ని సత్వరమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ నిధి పోర్టల్‌తో ఉద్యోగులకు కష్టాలు

ఫ ఐదు నెలలుగా అందని వేతనాలు

ఫ ఉద్యమ బాటలో కాంట్రాక్టు ఉద్యోగులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement