● రావణ్ ఎపిసోడ్‌తో పిఠాపురం, కాకినాడల్లో ఉద్రిక్తత
● పోలీసుల తీరుపై విమర్శలు
పిఠాపురం: ప్రశ్న యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్టు ఉదంతంతో రెండు వర్గాల మధ్య విద్వేషాలు చెలరేగినట్టు కనిపిస్తోంది. పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం నెలకొన్న ఉద్రిక్తతే దానికి నిదర్శనం. ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై జోసెఫ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిఠాపురానికి చెందిన జనసేన నాయకుడు బొజ్జా రామ్‌కుమార్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే, పోలీసులు మెరుపు వేగంతో కదిలారు. హుటాహుటిన కేసు నమోదు చేసి, ఎక్కడో హైదరాబాద్‌లో ఉన్న జోసెఫ్‌ను ఆగమేఘాల మీద పిఠాపురం తీసుకువచ్చారు. ఇంతవరకూ బాగానే ఉన్నా అతడిని చడీచప్పుడూ లేకుండా కోర్టులో హాజరు పరచాల్సి ఉండగా.. విషయం బయటకు పొక్కేంత వరకూ కాలయాపన చేశారనే విమర్శలు వచ్చాయి. దీంతో, జోసెఫ్‌కు మద్దతుగా దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. ఆయనను వెంటనే వదిలిపెట్టాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఇది తెలుసుకున్న జనసేన, విశ్వహైందవ పరిషత్ నాయకులు సైతం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళన బాట పట్టారు. దీంతో, పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అలా చేసి ఉంటే...
అధికార పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో పలు ఫిర్యాదులు రాగా.. కేవలం విచారణకు పిలిచి 41 నోటీసులిచ్చి పోలీసులు పంపించేవారు. అటువంటిది జోసెఫ్ కేసులో మాత్రం దుడుకుగా వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితుడిని మంగళవారం రాత్రి తీసుకువచ్చిన పోలీసులు బుధవారం ఉదయం కోర్టులో హాజరు పరచి ఉంటే ఎటువంటి అలజడికీ ఆస్కారం ఉండేది కాదు. అలా కాకుండా కాలయాపన చేయడం వల్లనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పట్టణ వాసులు విమర్శిస్తున్నారు. జోసెఫ్‌ను తీసుకువచ్చినప్పటి నుంచి అతడిని రాత్రి పిఠాపురం ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరు పరిచేంత వరకూ జరిగిన పరిణామాలన్నీ ప్రశ్నార్థకంగానే ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. సాధారణంగా ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ కేసులో ఏయే సెక్షన్లు అమలవుతాయో పోలీసులకు తెలిసే ఉంటుంది. జోసెఫ్‌పై అన్నీ బెయిలబుల్ సెక్షన్లే వేయాల్సి రావడంతో ఎలాగైనా రిమాండ్ వేసేలా చూడాలన్న ఒత్తిళ్లతోనే కాలయాపన చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చివరకు పిఠాపురం కేసులో జోసెఫ్‌కు బెయిల్ మంజూరైంది. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌తో పట్టణంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అదే జోసెఫ్‌ను ఎవరికీ తెలియకుండా ఉదయమే కోర్టులో హాజరు పరచి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, కేవలం పోలీసుల తీరు వల్లే ఇలా పట్టణం అంతా ఉద్రిక్తంగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు. జోసెఫ్‌కు ఇక్కడ బెయిల్ మంజూరు కావడంతో తమ పాచిక పారలేదనే అక్కసుతోనే అతడిని మరో కేసులో మళ్లీ అరెస్టు చేశారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో, మళ్లీ కాకినాడలోనూ గురువారం అదే పరిస్థితి నెలకొని, రెండు వర్గాల మధ్య పోరుగా మారిందని అంటున్నారు. ఈ ఉద్రిక్తతలకు పోలీసు ఉన్నతాధికారులు ఏవిధంగా కళ్లెం వేస్తారో చూడాల్సి ఉంది.


