● భక్తుల నుంచి కానుకలు డిమాండ్
చేసిన వ్రత పురోహితుడు
● గత ఏడాది చివరిలో
పాలకొల్లులో ఘటన
● విచారణ అనంతరం అప్పటి
ఈఓ క్రమశిక్షణ చర్యలు
● వాటిని రద్దు చేయాలంటూ ఇటీవల
ట్రస్ట్‌బోర్డు వివాదాస్పద తీర్మానం
అన్నవరం: కానుకలివ్వాలంటూ భక్తులను వేధించిన ఓ వ్రత పురోహితుడికి అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు కొంత మంది అండగా నిలవడం వివాదాస్పదమవుతోంది. వివరాలివీ.. శ్రీ గోవింద భక్త సంఘం ఆహ్వానం మేరకు అన్నవరం దేవస్థానం నుంచి వ్రత పురోహిత బృందం గత ఏడాది డిసెంబర్ 21న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వెళ్లి, సామూహిక వ్రతాలు నిర్వహించింది. ఆ సందర్భంగా దేవస్థానం ప్రథమ శ్రేణి వ్రత పురోహితుడు మల్లాది గురుమూర్తి వ్రత కథ చెప్పారు. వ్రతాలు ముగిసిన అనంతరం ఆయన గోదానం, భూదానం, వస్త్రదానం అంటూ భక్తుల నుంచి కానుకలు డిమాండ్ చేశారని వీడియోలతో సహా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు అందింది. దీనిపై అప్పట్లో శ్రీసాక్షిశ్రీ సహా పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ వ్యవహారంపై దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యుడైన పురోహితులపై చర్యలు తీసుకోవాలని గత డిసెంబర్ 22న అప్పటి అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావును ఆదేశించారు. విచారణ అనంతరం, వ్రతాల నిర్వహణకు నాడు పాలకొల్లు వెళ్లిన గురుమూర్తి సహా ఆరుగురు వ్రత పురోహితులును విధుల నుంచి ఆయన సస్పెండ్ చేశారు. అంతే కాకుండా ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, గురుమూర్తికి రెండు వార్షిక ఇంక్రిమెంట్లు రెండేళ్ల పాటు తగ్గించారు. భవిష్యత్తులో వ్రత కథ చెప్పకుండా నిరోధిస్తూ గత మార్చి 23న క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. మిగిలిన వ్రత పురోహితుల సస్పెన్షన్‌ను రద్దు చేశారు.
ట్రస్ట్‌బోర్డు సభ్యుల ఒత్తిడి
ఇదిలా ఉండగా గురుమూర్తిపై క్రమశిక్షణ చర్యలు నిలుపు చేయాలంటూ గత నెల 24న జరిగిన దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సమావేశంలో ఇద్దరు సభ్యులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. గురుమూర్తి అమాయకుడని, ఆయనపై అనవసరంగా చర్య తీసుకున్నారని వారు వాదించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనకు కట్ చేసిన రెండు ఇంక్రిమెంట్లలో ఒకటి పునరుద్ధరించడానికి, మూడు నెలల తరువాత మళ్లీ వ్రత కథ చెప్పడానికి అనుమతించాలని ట్రస్ట్‌బోర్డు తీర్మానించింది. వాస్తవానికి పాలకొల్లు ఘటనలోనే కాకుండా, గురుమూర్తి గతంలో కూడా పలుమార్లు సస్పెండవడం గమనార్హం.
ట్రస్ట్‌బోర్డుకు ఆ అధికారం ఉందా?
అన్నవరం దేవస్థానంలో సుమారు 250 మంది వ్రత పురోహితులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. వీరికి దేవస్థానం వ్రతాల ఆదాయంలో 40 శాతం కమీషన్‌గా ఇస్తారు. రెగ్యులర్ ఉద్యోగులు కానందున వీరిపై అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే దానిని ప్రశ్నించే లేదా తగ్గించే అధికారం ట్రస్ట్‌బోర్డుకు లేదు. ఈ మేరకు 2011 ఫిబ్రవరి 16న ట్రస్ట్‌బోర్డుకు అప్పటి ఈఓ ఓ లేఖ సమర్పించారు. దేవస్థానం రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే నిబంధనలు వీరికి వర్తించవని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో గురుమూర్తి వ్యవహారంలో ట్రస్ట్‌బోర్డు ఏ అధికారంతో తీర్మానం చేసిందనే ప్రశ్న తలెత్తుతోంది. దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు గత నెల 23న వ్రత పురోహితులతో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ భక్తుల నుంచి బలవంతంగా కానుకలు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విచిత్రంగా ఆ మర్నాడే గురుమూర్తిపై క్రమశిక్షణ చర్యలు రద్దు చేస్తూ ట్రస్ట్‌బోర్డు తీర్మానించడం గమనార్హం. ట్రస్ట్‌బోర్డు సభ్యుల అండ ఉంటే ఏమీ కాదనే సంకేతం ఇస్తున్నట్టుగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
న్యాయ సలహా తీసుకున్నాకే చర్యలు
వ్రత పురోహితుడు గురుమూర్తి వ్యవహారంపై ట్రస్ట్‌బోర్డు చేసిన తీర్మానంపై న్యాయపరమైన సలహా తీసుకుంటాం. ఆ తరువాతే తదుపరి చర్యలు చేపడతాం.
– నల్లం సూర్యచక్రధరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం


