కాకినాడ లీగల్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరించేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ–396ను వెంటనే రద్దు చేయాలని దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షుడు బీజే ప్రసాద్, కాకినాడ సంఘం అధ్యక్షుడు చోడపునీడి గోవిందరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం ప్రజల ఆస్తుల భద్రతకు ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా ప్రతి దస్తావేజుపై రూ.2 వేల అదనపు రుసుం వసూలు చేయడం వల్ల సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని అన్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటీకరించడం వల్ల పారదర్శకత దెబ్బ తింటుందని, ప్రజల హక్కులు, ఆస్తుల భద్రతపై అనిశ్చితి నెలకొనే ప్రమాదం ఉందని అన్నారు. జీఓ–396ను తక్షణమే ఉపసంహరించుకుని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు. దస్తావేజు లేఖర్ల లైసెన్సులను పునరుద్ధరించి, లేఖర్లు, వెండర్ల జీవనోపాధికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


