రామచంద్రపురం రూరల్: శైవ క్షేత్రం ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయానికి ఉత్తరాన ఉన్న పంచాయతీ ఖాళీ స్థలంలో కొత్తగా పోలీస్ స్టేషన్ నిర్మించాలని రెవెన్యూ, పోలీసు అధికారులు భావించారు. దీనిపై గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ‘శక్తి పీఠాన పోలీసు ఠాణా’ అనే శీర్షికన వచ్చిన కథనంతో వెనక్కి తగ్గారు. ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరైన నేపథ్యంలో మంగళవారం ఆర్డీఓ పి.సరళావతి సందర్శించి దీనికి ఆమోద ముద్ర వేశారు. దీంతో ద్రాక్షారామ పోలీసులు ఈ పంచాయతీ స్థలంలో 10 సెంట్లలో పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని భావించి ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ స్థలాన్ని కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల బుధవారం పరిశీలించిన సమయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ప్రజలు తమ మనోభావాలను వివరించారు. దీంతో పాటు గురువారం ‘సాక్షి’ పత్రికలో కథనం రావడంతో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా స్పందించి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ స్థలం వద్దని తెలపడంతో ఇక్కడి అధికారులు గురువారం తాము వేసిన ఫెన్సింగ్‌ను తొలగించారు. దీంతో గ్రామస్తులు, హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు.


