కాకినాడ రూరల్: వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యపై రౌడీషీట్ తెరవడం చాలా దారుణమని ఆ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పుసల అనిల్ ఆధ్వర్యాన బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. విద్యార్థి విభాగం కాకినాడ రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడాల గౌతమ్ తేజ, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్, సోషల్ మీడియా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నవరపు రాజేష్ మాట్లాడుతూ, మెగా డీఎస్సీలో అవకతవలపై ఆయన ప్రజాగళం వినిపించిన వారిని నిలువరించేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. భూదాహంతో అమరావతి ప్రాంత రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద పెనుమాక రైతులు తమ గోడు వినిపించారన్నారు. రైతుల విన్నపం మేరకు కమిటీతో పాటు చైతన్య వెళ్లారని, టీడీపీ గూండాలు దాడులు చేసినా ఆయన ప్రతిఘటించలేదని చెప్పారు. అయినప్పటికీ గత సంఘటనలు కొన్ని పేర్కొంటూ ఆయనపై ఇప్పుడు రౌడీషీట్ తెరవడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువతను కట్టడి చేసేందుకే చైతన్యపై కేసు నమోదు చేశారన్నారు. వైశ్య సామాజికవర్గానికి చెందిన చైతన్యను కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.


