పెట్టుబడా మోసం! | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడా మోసం!

Jul 1 2026 12:16 AM | Updated on Jul 1 2026 12:16 AM

రూ.19 లక్షలు కట్టాను

నేడు, నా భార్య, పిల్లల పేరిట రూ.19 లక్షల పెట్టుబడి పెట్టాను. 10 నెలలు, 20 నెలలు, 30 నెలల గడువుతో ఆదాయం వస్తుందని చెప్పారు. నెలనెలా సొమ్ములు ఇవ్వడం లేదు. మాకు భయం వేస్తోంది. సొమ్ము ఇప్పించేలా అధికారులు చొరవ తీసుకోవాలి.

– వనమాడి చిన్నా, గుడారిగుంట, కాకినాడ

పది నెలల క్రితమే కట్టాం

రూ.లక్షకు రూ.8 వేల వడ్డీ అన్నారు. విడతల వారీగా రూ.25 లక్షలు కట్టాం. ఐదు నెలలుగా డబ్బులు వేయడం లేదు. అధిక వడ్డీపై ఆశతో బంగారం తాకట్టు పెట్టి మరీ కట్టాం. ఇప్పుడు ఆందోళనగా ఉంది. మా సొమ్ము ఇప్పించాలి.

– పడమర రాజేశ్వరి, కాకినాడ

కాకినాడ రూరల్‌: తమ వద్ద పెట్టిన పెట్టుబడిని స్వల్ప వ్యవధిలోనే మూడు రెట్లు చేస్తామన్న సంస్థ నాలుగు నెలలుగా నెలవారీ ఇస్తామన్న సొమ్ము ఇవ్వడం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. వివరాలివీ.. కాకినాడ ఎన్‌ఎఫ్‌సీఎల్‌ రోడ్డులోని సిద్ధార్థ నగర్‌ కేఆర్‌కే ప్లాజాలో ఆల్మైటీ జెనెసిస్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ పేరిట ఓ సంస్థ కొన్నేళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రూ.లక్ష పెట్టుబడి పెడితే 30 నెలల్లో దాదాపు రూ.3 లక్షల వరకూ ముట్టజెబుతామని చెప్పింది. రూ.లక్ష కట్టిన వారికి మొదటి 10 నెలలకు ప్రతి నెలా రూ.15 వేల చొప్పున, తరువాత 20 నెలలకు సొమ్ము ఇస్తామని ఆ కంపెనీ సిబ్బంది చెప్పారు. అదేవిధంగా ప్రతి నెలా చెల్లించడంతో చెప్పడంతో వేలాది మంది రూ.లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. అయితే, నాలుగు నెలలుగా నెలవారీ చెల్లింపులు నిలిచిపోవడంతో వారిలో అనుమానం, ఆందోళన మొదలైంది. కంపెనీ సిబ్బందిని నిలదీస్తే జూన్‌ నెలాఖరున ఇస్తామని చెప్పడంతో మంగళవారం సాయంత్రం వరకూ వేసి చూశారు. అప్పటికీ సొమ్ము ఇవ్వకపోవడంతో పలువురు ఆ కంపెనీ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో, ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న సర్పవరం సీఐ సీహెచ్‌ ప్రకాష్‌, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. బాధితుల నుంచి, సంస్థ కార్యాలయంలోని సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సీఐ మీడియాతో మాట్లాడుతూ, ప్రజల నుంచి ఫోన్‌ రావడంతో తాము వచ్చామన్నారు. బాధితులకు కంపెనీ ఏవిధంగా హామీ ఇచ్చింది, ఎంత మంది పెట్టుబడి పెట్టారో, వారికి ఎందుకు చెల్లించలేదో తేలాల్సి ఉందని చెప్పారు. ఇద్దరు డైరెక్టర్లున్నట్లు చెబుతున్నారని, ఒకరు ఏలూరులో ఉన్నారని అన్నారు. రూ.4 లక్షలు పైబడి చెల్లించిన వారికి అసలు, వడ్డీ కలిపి నెలనెలా ఇస్తామన్నారని బాధితులు చెప్పారన్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన తరువాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రాథమిక అంచనా ప్రకారం డిపాజిటర్లు సుమారు రూ.50 లక్షల వరకూ పెట్టుబడి పెట్టి ఉంటారని భావిస్తున్నామన్నారు.

తీవ్ర

ఆందోళనలో బాధిత మహిళలు

పెట్టుబడిని మూడేళ్లలో

మూడు రెట్లు చేస్తామని ఎర

నెలవారీ సొమ్ములు ఇవ్వకపోవడంతో బాధితుల్లో అనుమానం

కాకినాడలోని సంస్థ

కార్యాలయం వద్ద ఆందోళన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement