ఖరీఫ్‌ కన్నీరేనా! | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ కన్నీరేనా!

Jul 1 2026 12:16 AM | Updated on Jul 1 2026 12:16 AM

సాగు ప్రారంభం కాక పిఠాపురం మండలం రాపర్తిలో ఖాళీగా ఉన్న పంట భూములు

శివారు పొలాలకు ఇప్పటికీ

అందని సాగునీరు

నిండుకున్న ‘ఏలేరు’

నారుమళ్లు ఆలస్యం

ఆందోళనలో రైతులు

పిఠాపురం: ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. ప్రభుత్వ పెద్దలు కూడా అదే చెప్పుకొచ్చారు. తీరా చూస్తే వారి మాటలకు అర్థాలే వేరు అన్నట్టుగా ఖరీఫ్‌ సాగు పరిస్థితి తయారైంది. ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, రైతులు ముందస్తు సాగు చేసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం పదేపదే చెబుతోంది. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు తగినట్టుగా లేదు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి జూన్‌ ఒకటో తేదీనే నీరు విడుదల చేసినా.. అది ఇప్పటికీ శివారు ప్రాంతాలకు చేరలేదు. మరో వారం రోజులకు కానీ చివరి భూములకు నీరందే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు అదునుకు కురిసిన వానలూ అంతంత మాత్రమే. కొన్నిచోట్ల అవి మడిని తడపడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. ఫలితంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ నారుమడులు ప్రారంభం కాలేదు. మరోవైపు జిల్లాలోని ఏలేరు, తాండవ, పంపా రిజర్వాయర్లతో పాటు పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి జలాలు ఎప్పుడు విడుదల చేస్తారో స్పష్టత లేదు. దీంతో, పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల రైతుల్లో ఖరీఫ్‌ సాగుపై అయోమయం నెలకొంది.

నిండుకున్న ‘ఏలేరు’

జిల్లాలోని అతి పెద్ద మీడియం ఇరిగేషన్‌ పథకం ఏలేరు రిజర్వాయర్‌. దీని పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24.11 టీఎంసీలు. సాధారణంగా జూన్‌ పదో తేదీ నాటికే ఏలేరు జలాలు విడుదల చేసేవారు. దీంతో, రైతులు నారుమళ్లు వేసి, జూలై మొదటి వారానికి వరి నాట్లు పూర్తి చేసేవారు. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. రిజర్వాయర్‌ నుంచి 150 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ అవి శివారుకు చేరుకోవడం సాధ్యం కాదని రైతులు అంటున్నారు. ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు ప్రస్తుతం 8.57 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇందులో 6 టీఎంసీలు డెడ్‌ స్టోరేజీ. మిగిలిన 2.80 టీఎంసీల నీటినే విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు, పంటల సాగుకు విడుదల చేయాలి. ఇంత తక్కువ నీరు మెట్టలో వరిసాగుకు ఏమాత్రం సరిపోదు. రిజర్వాయర్‌లో నీటి నిల్వలు 12 టీఎంసీలకు పెరిగితేనే కానీ సాగునీరు విడుదల చేసే అవకాశం ఉండదు. ఇటీవలి వర్షాలకు జలాశయంలో నీటి నిల్వలు పెరిగిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితు ల్లో ఏలేరు నీటి విడుదలలో మరింత జాప్యం జరగవచ్చనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఏలేరు జలాలు మడిని తడిపితేనే దమ్ములు చేసుకోగలమని అంటున్నారు. పరిస్థితి చూస్తూంటే ఆగస్టు మొదటి వారం వరకూ వరి నాట్లు సాగుతూనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆధునీకరణ లేక..

ప్రభుత్వం ఏలేరు ఆధునీకరణను చేపట్టకపోవడంతో ఏటా ఆగస్టు, అక్టోబర్‌లో వరదలు, తుపానులు రావడం, ఆయకట్టులోని పంటలు ముంపు బారిన పడి, రైతులు నష్టపోవడం జరుగుతూనే ఉంది. ఖరీఫ్‌ ముందస్తు సాగు చేపడితే ఈ వరదల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని భావించినా.. షరా మామూలుగానే జాప్యం జరిగింది. దీంతో, ఈ ఏడాది కూడా తమ పంటలకు ముప్పు తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

నీరు రాక.. నారు లేక..

జిల్లాలో జూన్‌ 16 నుంచి నారుమళ్లు వేసి, జూలై నెలాఖరుకు నాట్లు పూర్తి చేయాలని అధికారులు చెప్పారు. దీనివలన పంట చివరిలో ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా ఉంటుందన్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 2,36,435 ఎకరాల్లో వరి సాగు చేయాలన్నది లక్ష్యం. ఈపాటికే 2,700 హెక్టార్లలో నారుమళ్లు వేయాల్సి ఉండగా.. ఇవి 10 శాతం కూడా దాటలేదు. నారు వేసే పనులు జూలై నెలాఖరుకు కానీ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే ఖరీఫ్‌ సాగు 25 రోజులు ఆలస్యమవడంతో ముందస్తు సాగు కాస్తా వెనుకపట్టు పట్టే పరిస్థితి కనిపిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement