ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు మంగళవారం 9,593 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 2,679, మధ్య డెల్టాకు 1,914, పశ్చిమ డెల్టాకు 5 వేల క్యూసెక్కుల చొప్పున వదిలారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 8.20 అడుగులు ఉంది.
నేటి నుంచి ఫ్లడ్ కంట్రోల్ రూమ్
ధవళేశ్వరం: వరదల సీజన్ ప్రారంభం కానుండటంతో ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ కార్యాలయం వద్ద బుధవారం నుంచి ఫ్లడ్ కంట్రోల్ రూమ్ పని చేయనుంది. ఇది అక్టోబర్ 31వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని హెడ్‌వర్క్స్ ఈఈ జి.శ్రీనివాసరావు తెలిపారు. వరదలకు సంబంధించి ఎటువంటి సమాచారం కావాలన్నా ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను 0883–2417066 నంబరులో సంప్రదించాలని సూచించారు.
ముద్రగడ త్వరగా కోలుకోవాలి
రాజమహేంద్రవరం సిటీ: హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభాన్ని మాజీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్, రాష్ట్ర కార్యదర్శి తోట రామకృష్ణ మంగళవారం పరామర్శించారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిని ఆయన కుమారుడు వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి గిరిబాబును అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
సురక్షితంగా స్వదేశానికి..
అమలాపురం రూరల్: మస్కట్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళను కేసీఎం అధికారులు సురక్షితంగా స్వదేశానికి రప్పించారు. అల్లవరం మండలం ఎన్.రామేశ్వరం చెందిన సీహెచ్.ధనలక్ష్మి మస్కట్‌కు ఉపాధి నిమిత్తం వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కలెక్టర్ మహేష్‌కుమార్ చొరవతో ఆమెను సురక్షితంగా భారతదేశానికి రప్పించడం జరిగింది. ఆమె 13 ఏప్రిల్ 2026న విజయవాడకు చెందిన ఏజెంట్ పి. సునీత ద్వారా మస్కట్‌కు వెళ్లారు. అక్కడ అధిక పని గంటలు, తీవ్రమైన పని ఒత్తిడి, అనారోగ్య పరిస్థితుల కారణంగా పనిచేయలేని స్థితికి చేరుకోవడంతో స్వదేశానికి రావాలని కోరుకున్నారు. కుటుంబ సభ్యులు కలెక్టరేట్‌లోని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసీఎం అధికారులు ఏజెంట్, యజమాని ఇతర సంబంధిత వర్గాలతో సమన్వయం చేసి ధనలక్ష్మిని సురక్షితంగా కోనసీమకు రప్పించారు. కేసీఎం నోడల్ అధికారి సుబ్బారావుకు, కలెక్టర్‌కు, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సమన్వయకర్త గోళ్ళ రమేష్, బి నాగరాజు(మస్కట్ ) కడియాల సత్తిబాబు, షేక్ బీబి సఫియా పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై
అప్రమత్తంగా ఉండాలి
అడ్డతీగల: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అడ్డతీగల సీఐ గజేంద్ర కుమా ర్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో మంగళవా రం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అపరిచితులతో మొబైల్ చాటింగ్, కాల్స్ మాట్లాడడం, అనుమానిత యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించడం చేయరాదన్నారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గంజాయి తదితర మత్తు పదార్థాలతో అనేక అనర్థాలు కలుగుతాయని, వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. వాహనచోదకులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు.


