● రత్నగిరిపై పూజాద్రవ్యాల రేట్లపై సందిగ్ధత
● 6 కొబ్బరి కాయలు,
6 అరటిపండ్లకు రూ.180కి పాట
● రూ.280కి పెంచాలని పాటదారుల వినతి
అన్నవరం: రత్నగిరిపై పూజాద్రవ్యాల షాపుల్లో కొబ్బరి కాయలు, అరటి పండ్లు ఎంత ధరకు విక్రయించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. సత్యదేవుని వ్రతాల్లో 6 కొబ్బరి కాయలు, 6 అరటి పండ్లను వ్రతం సెట్టుగా భావిస్తారు. వ్రతం సెట్టును నిర్ణీత రూ.180కి కాకుండా రూ.300 వరకూ విక్రయిస్తున్నారంటూ జూన్ 24న జరిగిన ట్రస్ట్‌బోర్డు సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి హాజరైన పాటదారులు ఈ విషయాన్ని అంగీకరిస్తూనే.. రూ.180 రేటు పదేళ్ల కిందటిదని, ఇది గిట్టుబాటు కాదని చాలాసార్లు వినతి పత్రాలు సమర్పించామని, ఆ రేట్లకే అమ్మాలనడం సమంజసం కాదని తెలిపారు. దీనిని రూ.280కి విక్రయించేందుకు అనుమతించాలని వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని అన్ని దేవస్థానాల్లో కొబ్బరి కాయ రూ.35 నుంచి రూ.50 వరకూ, అరటి పండ్లు డజను రూ.60 నుంచి రూ.80 వరకూ విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ, ద్వారకా తిరుమల దేవస్థానాల్లో కొబ్బరి కాయ రూ.35కు విక్రయిస్తున్నారు. ఆమేరకు రత్నగిరిపై 6 కొబ్బరి కాయలు రూ.210కి, అరడజను అరటి పండు రూ.40కి విక్రయించేందుకు అనుమతించాలని పాటదారులు కోరుతున్నారు. మిగిలిన రూ.30కి పసుపు, కుంకుమ, పు వ్వులు, తులసి దళాలు, అగరువత్తులు, హారతి కర్పూ రం ఇస్తారు. ఈ పదేళ్లలో షాపుల అద్దెలు మూడు రెట్లు పెరిగినా ఈ రేట్లు మాత్రం పెంచలేదని తెలిపారు.
రూ.4 కోట్ల ఆదాయం
పశ్చిమ రాజగోపురం వద్ద ఉన్న రెండు పూజాద్రవ్యాలు, ఫ్యాన్సీ షాపులకు జూన్ 17న జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో పాట ఖరారైంది. షాపు నంబర్–1కు నెలకు రూ.16.73 లక్షలు (పాత వేలం పాట రూ.13.81 లక్షలు), షాపు నంబర్–2కు నెలకు రూ.18.33 లక్షల(పాత పాట రూ.10.26 లక్షలు)కు వేలం పాడారు. తద్వారా దేవస్థానానికి ఏడాదికి రూ.4.20 కోట్ల ఆదాయం రానుంది. దీనిపై జీఎస్టీ 18 శాతం చెల్లించాలి. రెండో ఏడాది ఈ మొత్తంపై 10 శాతం అధికంగా చెల్లించాలి. ఈ రెండు షాపుల్లోనూ పూజాద్రవ్యాలతో పాటు ఫ్యాన్సీ వస్తువులు కూడా అమ్ముకోవచ్చు. దేవస్థానానికి ఆరు నెలల పాట సొమ్ము జమ చేసి, వ్యాపారం చేయాలనేది నిబంధన. జూలై 13 నుంచి ఈ పాట అమలులోకి రానుంది. పాటదారుల విజ్ఞప్తి నేపథ్యంలో పాత రేటు రూ.180నే కొనసాగించాలా లేక రూ.280కి పెంచాలా అనేదానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రేటు పెంచాలని నిర్ణయిస్తే ఈ షాపులతో పాటు రామాలయం ఎదురుగా ఉన్న మరో రెండు పూజాద్రవ్యాల షాపులకు కూడా వర్తింపజేయాల్సి ఉంటుంది. దీనికి నిబంధనలు వర్తిస్తాయా అనే సందేహం కూడా ఉంది.
కమిషనర్ ఆదేశాల మేరకే నిర్ణయం
దేవస్థానంలో వ్రతం సెట్టు రేటు పెంపు అంశాన్ని దేవదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, ఆయన ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తాం. ఒకవేళ మళ్లీ వేలం నిర్వహించాలని ఆదేశిస్తే ఆ మేరకు చర్యలు తీసుకుంటాం.
– నల్లం సూర్యచక్రధరరావు,
ఈఓ, అన్నవరం దేవస్థానం


