బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హెచ్చరించారు. సర్ ప్రక్రియలో భాగంగా స్థానిక శాంతి నగర్‌లోని 48వ పోలింగ్ కేంద్రం పరిధిలో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణి ప్రక్రియను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీలో జాప్యానికి గల కారణాలను ఏఈఆర్‌ఓ, బూత్ లెవెల్ అధికారి (బీఎల్‌ఓ), సూపర్‌వైజర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా జిల్లాలో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. చనిపోయిన, ఆచూకీ తెలియని, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్ల పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆచూకీ తెలియని, శాశ్వత వలస ఓటర్ల గృహాలకు నిబంధన ప్రకారం తప్పనిసరిగా నోటీసులు అతికించాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, తిరిగి ఓటర్ల నుంచి స్వీకరించడంలో స్వయం సహాయక సంఘాలు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సహాయం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ వి.జితేంద్ర కూడా పాల్గొన్నారు.
ఇంటర్మీడియెట్ విద్యాధికారిగా
రాంబాబు
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఇంటర్మీడియెట్ విద్య అధికారిగా జ్యోతుల రాంబాబు నియమితులయ్యారు. ఇప్పటి వరకూ పని చేసిన వి.కేశవరావు ఉద్యోగ విరమణ చేశారు. దీంతో, ఆయన స్థానంలో కాకినాడ పీఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న రాంబాబును నియమించారు. ఆయనను పలువురు జూనియర్ కళాశాలల అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది అభినందించారు.
ఐఆర్ ప్రకటించాలి
అమలాపురం టౌన్: నిత్యావసర వస్తువుల ధరలు, ఆస్పత్రుల ఖర్చులు పెరిగిపోయాయని కోనసీమ జిల్లా ఇంటర్మీడియట్ పెన్షనర్ల అసోసియేషన్ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ వేసి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేసింది. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా అసోసియేషన్ ప్రతినిధి కోలా వెంకటేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, హెల్త్ కార్డులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసేలా చూడాలని డిమాండ్ చేశారు. 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ 7 నుంచి 10 శాతానికి, 75 సంవత్సరాలు నిండిన వారికి 12 నుంచి 15 శాతం పెంచాలని సూచించారు.


