డాక్టర్‌ సత్యవతికి లెజెండరీ అవార్డు | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ సత్యవతికి లెజెండరీ అవార్డు

Jul 1 2026 12:16 AM | Updated on Jul 1 2026 12:16 AM

కాకినాడ క్రైం: నగరానికి చెందిన ప్రముఖ గైనకాలజీ వైద్యులు ఏఎల్‌ సత్యవతిని ప్రతిష్టాత్మక ఏపీ ఐఎస్‌ఏఆర్‌ లెజెండ్స్‌ ఆఫ్‌ రిప్రొడెక్టివ్‌ మెడిసిన్‌ అవార్డు వరించింది. ఏపీ ఐఎస్‌ఏఆర్‌ (ఇండియన్‌ సొసైటీ ఫర్‌ అసిస్టెడ్‌ రీప్రొడక్షన్‌) ఆధ్వర్యాన గుంటూరు జింఖానా ఆడిటోరియంలో మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి కాన్‌క్లేవ్‌లో ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 1998లోనే తొలి ఐవీఎఫ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, 2000 మార్చిలో తొలి టెస్ట్‌ట్యూబ్‌ బేబీకి డాక్టర్‌ సత్యవతి ప్రాణం పోశారు. సింగపూర్‌లోని నేషనల్‌ యూనివర్సిటీ హాస్పిటల్స్‌, బెల్జియంలోని జంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఫెర్టిలిటీ టెక్నాలజీస్‌లో ప్రపంచ ప్రఖ్యాత ఎంబ్రియాలజిస్ట్‌ మార్టిన్‌ ఎన్‌ఐజేఎస్‌ వద్ద మన దేశానికి అప్పటికి పరిచయం కాని ఇంట్రా సైటాప్లాస్మిక్‌ స్పెర్మ్‌ ఇంజక్షన్‌ (ఇక్సీ) ఫలదీకరణ విధానంపై శిక్షణ పొందారు. ఈ ప్రక్రియను 2001లో ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఇంక్యుబేటర్‌లో మూడు రోజుల పాటు బాహ్య ఫలదీకరణ చేసి, నాలుగో రోజు బ్లాస్టోసిస్ట్‌ కల్చర్‌ అవలంబించి ఓ శిశువుకు ప్రాణం పోసి, సంచలనం సృష్టించారు. అరుదైన శాసీ్త్రయ విధానాల్లో పుట్టిన వీరందరూ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యవంతులుగా వారి జీవితాలను ఆనందంగా కొనసాగిస్తున్నారు. కాకినాడలోని సృజన మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌, ఐవీఎఫ్‌ సెంటర్‌ ద్వారా డాక్టర్‌ సత్యవతి వందలాది ప్రసవాలు చేశారు. ఎక్కువ మంది కవలలకు ప్రసవాలు చేసిన ఘనత దక్కించుకున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రాణాలతో పుట్టడానికి ఏమాత్రం ఆస్కారం లేని ఎపిడెర్మోలసిస్‌ బులోసా (చర్మం ఊడి పుట్టడం) అనే అరుదైన జన్యులోపంతో పుట్టిన మగశిశువు ప్రసవాన్ని విజయవంతంగా నిర్వహించారు. తల్లి గర్భం నుంచి శిశువును ప్రాణాలతో బయటకు తీసి, కుటుంబ సభ్యుల విన్నపం మేరకు మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. వీటన్నింటి నేపథ్యంలో డాక్టర్‌ సత్యవతిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆమెను సీనియర్‌ వైద్యులు సహా ప్రముఖులు అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement