ఎరువాక సాగారు.. | - | Sakshi
Sakshi News home page

ఎరువాక సాగారు..

Jun 30 2026 12:07 AM | Updated on Jun 30 2026 12:07 AM

జగ్గంపేట: మండలంలోని మామిడాడలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులతో కలసి నాగలి పట్టి పొలం పనులను కాకినాడ కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ప్రారంభించారు. వ్యవసాయ శాఖ, ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఐటీఐలో ప్రవేశాలకు

దరఖాస్తుల పరిశీలన

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను దగ్గరలోని ప్రభుత్వ ఐటీఐలో పరిశీలన చేయించుకోవాలని ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎంవీజే వర్మ సోమవారం తెలిపారు. ఇప్పటి వరకూ ఆన్‌లైన్‌ ద్వారా 2,052 దరఖాస్తులు రాగా, 1,342 మంది అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్‌ చేయించుకున్నారన్నారు. ఈ ప్రక్రియ వచ్చే నెల 2వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు మంగళవారం సాయంత్రంతో గడువు ముగుస్తుందని, అభ్యర్థులకు సందేహాలు ఉంటే 94404 08182 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని వివరించారు.

తనిఖీలు పూర్తయ్యాకే

బోట్లకు అనుమతి

దేవీపట్నం: గోదావరి నదిలో పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటక బోట్లకు పూర్తి స్థాయిలో తనిఖీలు పూర్తయ్యాకే అనుమతులు మంజూరు చేస్తామని పోలవరం జేసీ కలెక్టర్‌ సూరపాటి ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. పోశమ్మగండి వద్ద పర్యాటక బోట్ల యాజమాన్యంతో కలసి సోమవారం ఆయన పర్యాటక బోట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పర్యాటకుల భద్రతే ప్రధానమని దీనిని దృష్టిలో ఉంచుకుని పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి ఫిట్‌నెస్‌ కలిగిన వాటిపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామన్నారు. భద్రతా ప్రమాణాలు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, నిర్దేశించిన భద్రతా పరికరాలు లేని బోట్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదన్నారు. ప్రతి టూరిస్టు లైఫ్‌ జాకెట్లు వాడేలా చర్యలు చేపట్టాలన్నారు. బోట్లలో అనుమతించిన పరిమితికి మించి ఎక్కించుకున్నా, పర్యాటకులు భద్రత విషయంలో నిర్ల్యక్షం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బోటు యజమానులు అన్ని భద్రతా నియమాలు, నిబంధనలు పాటిస్తూ అధికారులకు సహకరిస్తూ పర్యాటకులు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

డీఏసీఎల్‌ స్పెషాలిటీ కెమికల్స్‌ ప్లాంట్‌కు ఒప్పందం

తొండంగి: కాకినాడ జిల్లా కోన ప్రాంతం కేఎస్‌ఈజెడ్‌ (కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి)లో రూ.500 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన డీఏసీఎల్‌ ఫైన్‌ కెమ్‌ అత్యాధునిక ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేఎస్‌ఈజెడ్‌, డీఏసీఎల్‌ సంస్థల మధ్య సోమవారం కీలక ఒప్పందం జరిగింది. కేఎస్‌ఈజెడ్‌ పరిధిలోని తొండంగి మండలంలో 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక స్పెషాలిటీ కెమికల్స్‌ ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కాకినాడ సెజ్‌ సీఈఓ రామ్‌రెడ్డి ఓజిలి తెలిపారు. ఈ మేరకు డీఏసీఎల్‌ ఫైన్‌ కెమ్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ అమిత్‌ మెహతాను కలసి ఒప్పందంపై సంతకాలు చేసినట్టు వెల్లడించారు. అరబిందో ఇండస్ట్రియల్‌ సిటీగా వ్యవహరిస్తున్న కాకినాడ సెజ్‌ సుమారు 600 ఎకరాల్లో విస్తరించి ఉందని, దేశంలోని అతి పెద్ద పోర్ట్‌ ఆధారిత పారిశ్రామిక పార్కుల్లో ఇది ఉందని చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 12కు పైగా సీఫుడ్‌ పరిశ్రమలు ఉన్నాయన్నారు. అరబిందో 500 ఎకరాల్లో పెద్ద ప్లాంట్‌ ఏర్పాటు చేయగా.. కొత్తగా మరో ఆరు సంస్థలు ప్రాజెక్టుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. డీఏసీఎల్‌ ఫైన్‌ కెమికల్స్‌తో పాటు డయా మైన్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థలుగా ఉన్నాయన్నారు. ఫార్మా ఆగ్రో కెమికల్స్‌, పాలిమర్స్‌, పెయింట్స్‌ వంటి రంగాలకు అవసరమైన కీలక రసాయనాలను (ముఖ్యంగా ఇథిలీనమైన్స్‌)ను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం తయారు చేస్తుందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement