బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పదే పదే తిరుగుతున్నాం.. మొర ఆలకించండంటూ మొరపెట్టుకుంటున్నాం.. కాళ్లు అరుగుతున్నాయ్ తప్ప ప్రయోజనం శూన్యమంటూ అర్జీదారులు నిట్టూర్పు వదులుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)పై అర్జీదారులకు నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రతి వారం ఈ కార్యక్రమం మొక్కుబడి తంతుగా సాగుతుందని వారు వాపోతున్నారు. తమ సమస్యలు ఎప్పటికి పరిష్కారమవుతాయోనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న సమస్యల పరిష్కారానికీ నెలలు తరబడి తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌కు 318 అర్జీలు వచ్చాయి. ఇందులో పలువురు వచ్చిన అర్జీలను పరిశీలిస్తే..
గుక్కెడు నీరు అందక..
కొన్ని రోజులుగా తాగునీరు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. స్థానికంగా ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నీరు కొనుగోలు చేసుకుని తాగాల్సి వస్తోంది. మా ప్రాంతంలో అందరూ నిరుపేదలే. స్థానిక నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. అందుకే ఇక్కడకు వచ్చా.
– లంగడ మాలతి, కేశవపురం, తాళ్లరేవు మండలం
పంట కాలువను మూసివేశారు
స్థానిక టీడీపీ నాయకులు మా పంట పొలాలకు వెళ్లేదారి, పంట కాలువను ఆక్రమించారు. వేలంక గ్రామంలో సుమారు 50 ఎకరాలకు పైగా సాగునీరు అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఏలేరు కాలువకు అనుసంధానంగా ఉన్న కాలువను మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో కాకినాడ వచ్చి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.
– దోమాల వెంకటేశ్వరరావు, గణేశ్వరరావు,
కృష్ణజడ్జి, వేలంక, కిర్లంపూడి మండలం
ఏడాదిగా తిరుగుతున్నా..
నేను నడవలేని స్థితిలో ఉన్నాను. మనిషి సాయం లేనిదే బయటకు రాలేను. ఎక్కడికై నా వెళితే వీల్ చైర్ ఉండాలి. పింఛను అందించాలంటూ స్థానిక సచివాలయంలో అనేక సార్లు అర్జీలు పెట్టుకున్నా పట్టించుకోలేదు. ఎన్నో ఇబ్బందులు పడి కలెక్టరేట్‌కు వచ్చినా ఎవరూ స్పందించడం లేదు.
– ఆవాల రమాదేవి,
ఫ పీజీఆర్‌ఎస్‌పై సన్నగిల్లుతున్న నమ్మకం
ఫ ఎన్నాళ్లు తిరగాలంటున్న అర్జీదారులు


