93 శాతం మందికి పోలియో చుక్కలు | - | Sakshi
Sakshi News home page

93 శాతం మందికి పోలియో చుక్కలు

Jun 29 2026 12:17 AM | Updated on Jun 29 2026 12:17 AM

కాకినాడ క్రైం: పల్స్‌పోలియో చుక్కల మందు కార్యక్రమం ఆదివారం జిల్లావ్యాప్తంగా జరిగింది. మొత్తం 1,63,310 మంది ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నది లక్ష్యం కాగా 1,51,611 మందికి (93 శాతం) వేశామని డీఎంహెచ్‌ఓ నరసింహ నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సిబ్బంది సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిన పిల్లలకు ఈ మందు వేస్తారన్నారు.

పారదర్శకంగా ‘సర్‌’

కాకినాడ లీగల్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ ఆదేశించారు. జిల్లాలోని ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్‌ఓలు), సహాయ ఎన్నికల నమోదు అధికారుల(ఏఈఆర్‌ఓల)తో కలెక్టరేట్‌ నుంచి ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వివిధ రాజకీయ పార్టీల బూత్‌ స్థాయి ఏజెంట్ల(బీఎల్‌ఏ)తో సమన్వయం చేసుకుంటూ సర్‌ ప్రక్రియను బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి పాల్గొన్న కాకినాడ సిటీ ఈఆర్‌ఓ కేటీ సుధాకర్‌ మాట్లాడుతూ, సిటీ నియోజకవర్గంలో సర్‌ ప్రక్రియ పురోగతిని కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో అర్బన్‌ తహసీల్దార్‌ జితేంద్ర, డిప్యూటీ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌, డీసీపీ కృష్ణారావు, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్‌ గోవిందరాజులు, ఏపీఓ రామిరెడ్డి, ఏఎస్‌డబ్ల్యూఓ వాణి, డిప్యూటీ తహసీల్దార్లు అనిల్‌, తాతారావు తదితరులు పాల్గొన్నారు.

7 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు

వై.రామవరం: మండలంలోని గుర్తేడు పోలీసు స్టేషన్‌ పరిధిలో ఆదివారం సుమారు రూ.3.5 లక్షల విలువైన 7 కిలోల గంజాయిని గుర్తేడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రాజకోటి తెలిపిన వివరాల మేరకు సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి అక్రమ రవాణా అవుతుందన్న సమాచారం మేరకు మండలం జి.కొత్తూరు గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, నరసారావుపేటకు చెందిన రాజనాల కోటిరెడ్డి (62) ఈ సరకుతో పట్టుబడ్డాడు. సరకును దారకొండ నుంచి గుర్తేడు మీదుగా నరసారావుపేట తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడు, గంజాయితో పాటు, ఒక మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ఎస్సై తెలిపారు.

నేడు ఏపీ జేఏసీ అమరావతి సమావేశం

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యాన స్థానిక కోటిపల్లి బస్టాండ్‌ సమీపాన ఉన్న రెవెన్యూ భవనంలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీలో భాగస్వాములుగా ఉన్న వివిధ ఉద్యోగ సంఘాల జిల్లా, డివిజన్‌ నాయకులతో సోమవారం సమావేశం నిర్వహిస్తున్నారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ ఎం.కాంతిప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి ఏఆర్‌ శివకుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ సమావేశానికి అమరావతి జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై, ఉద్యమ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు.

అడ్డతీగలలో అత్యధిక వర్షపాతం

అడ్డతీగల: జిల్లాలో ఆదివారం ఉదయం 8.30 గంటల వరకూ నమోదైన వివరాల ప్రకారం అడ్డతీగలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో పలు చోట్ల స్వల్ప నుంచి ఒక మోస్తరు వర్షపాతం నమోదైంది. అడ్డతీగల మండలంలో అత్యధికంగా 18.2 మిల్లీమీటర్లు నమోదు కాగా ఎటపాకలో 14.8, గంగవరంలో 12.4, రంపచోడవరంలో 9.2, గుర్తేడులో 6.4, వై.రామవరంలో 5, దేవీపట్నంలో 4.8, రాజవొమ్మంగిలో 2.6, మారేడుమిల్లిలో 1.2, వీఆర్‌ పురంలో 1.2, కూనవరంలో 0.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.కాగా చింతూరు మండలంలో వర్షపాతమే నమోదు కాలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement