● ఇదెక్కడి నిర్లక్ష్యం?
వారిద్దరూ మన రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు. ఒకరు.. రూ.2కే కిలో బియ్యంతో పాటు వివిధ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేసిన మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు. మరొకరు.. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి వినూత్న పథకాలతో తన చివరి ఊపిరి వరకూ పేదల సంక్షేమాన్నే శ్వాసించడమే కాదు.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వ నిరాదరణకు గురైన అన్నదాతల కన్నీరు తుడిచి, జలయజ్ఞం వంటి వినూత్న పథకాలతో అడుగడుగునా అండగా నిలిచిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఈ ఇద్దరు మహనీయుల గురించి తెలియని వారు ఏ ఒక్కరూ ఉండరు. ఆ నేతల నుంచి నిత్య స్ఫూర్తి పొందేందుకు గండేపల్లి మండలం రామేశంపేట నాలుగు రోడ్ల జంక్షన్‌లో అభిమానులు వారి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఏడీబీ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆ విగ్రహాలను పక్కనే ఉన్న ఒక ఖాళీ ప్రదేశంలోకి మార్చారు. అప్పటి నుంచీ వాటి ఆలనా పాలనా పట్టించుకున్న వారే లేరు. ఆ ప్రదేశాన్ని మట్టితో నింపేయడంతో ఆ విగ్రహాలు మొల లోతులో కూరుకుపోయి ఇలా దర్శనమిస్తున్నాయి. ఈ మార్గంలో నిత్యం అనేక మంది అధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోకలు సాగిస్తూంటారు. కానీ, ఈ మహనీయుల విగ్రహాలను ఏ ఒక్కరూ పట్టించుకోకుండా ఇలా అగౌరవపరచడంపై వారి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– గండేపల్లి


