పిఠాపురం: ప్రభుత్వం హడావుడిగా చేపట్టిన మున్సిపల్ వార్డుల విభజనకు బ్రేక్ పడింది. వార్డుల విభజనను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు తాత్కాలికంగా నిలిపివేయాలని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో వివిధ మున్సిపాలిటీల్లో చేపట్టిన వార్డుల విభజన ఆగిపోయింది. జీఓ ఎంఎస్ నంబరు 64, ఎంఏ అండ్ యూడీ సీ డిపార్టుమెంట్ 24 మార్చి 2026వ తేదీన ప్రస్తుతం ఉన్న వార్డుల్లో పునర్విభజన చేపట్టాలని మున్సిపాలిటీలకు పురపాలక శాఖ కమిషనర్ ఏప్రిల్ 1వ తేదీ 2026న ఆదేశాలు జారీ చేశారు. దీంతో అన్ని మున్సిపాలిటీల్లోను అధికారులు విభజన ప్రక్రియ పూర్తి చేసి 17 మే 2026న ముసాయిదా ప్రకటనను విడుదల చేసి ఆయా మున్సిపాలిటీల నోటీసు బోర్డుల్లో ప్రకటించి ప్రజల నుంచి సూచనలు, సలహాలను కోరారు. ప్రజలు తమ అభ్యంతరాలను సలహాలను 18 మే 2026 నుంచి 24 మే 2026 లోపల తెలియజేయాలని కోరారు. ఈ ప్రక్రియ పూర్తయితే మున్సిపల్ ఆర్డీ, కలెక్టర్ల పరిధిలో వాటిని పరిష్కరించి తుది నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ విభజన హేతు బద్ధంగా లేదని అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్త మయ్యింది. అయినప్పటికి వార్డుల విభజనను కొనసాగించడానికి అధికారులు సిద్ధం కావడంతో పిఠాపురం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తలిశెట్టి వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. మున్సిపాలిటీలో జరిగిన వార్డుల విభజన సక్రమంగా లేదని, ఒకపక్క 2027 జన గణన జరుగుతుండగా వార్డుల విభజన ఎలా చేస్తారని వెంటనే వార్డుల విభజన ప్రక్రియను నిలుపుదల చేయాలని హైకోర్టుకు విన్నవించారు. రాష్ట్రంలో 11 మున్సిపాలిటీల నుంచి ఇలాంటి పిటీషన్లు రావడంతో వాటిని విచారించిన హైకోర్టు జనగణన జరుగుతుండగా ఎలా విభజన చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వార్డుల విభజనను నిలుపుదల చేయాలని ఈ రిట్ పిటీషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో వార్డుల విభజనకు బ్రేక్ పడింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు అన్ని మున్సిపాలిటీలకు వర్తిస్తాయని న్యాయ నిపుణులు అంటున్నారు.
హేతుబద్ధంగా లేకే
హైకోర్టును ఆశ్రయించాం
చాలా అసంబద్ధంగా వార్డులు విభజించారు. సంబంధం లేని ప్రాంతాలను వార్డులుగా విభజించారు. ఒక్కో వార్డు రెండు మూడు కిలోమీటర్లు ఉండేలా విభజించారు. గతంలో ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా భిన్నంగా ఉంది. ఒక పక్క జనాభా లెక్కలు జరుగుతుంటే అది తేలకుండా వార్డుల విభజన ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఏవార్డులోకి ఎంత జనాభా వస్తుందనేది లెక్కలు తేలితేనే కదా తెలిసేది. ఎప్పుడో పాత జనాభా లెక్కల ప్రకారం వార్డులు విభజిస్తే ఎలా కుదురుతుంది. కొత్త జనాభా లెక్కలు వచ్చాక విభజన చేస్తే సమగ్రంగా ఉంటుంది. దీనిపై వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు అందరం కలిసి అభ్యంతరాలను తెలుపుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశాం. అయినప్పటికీ న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం.
– తలిశెట్టి వెంకటేశ్వరరావు,
మాజీ కౌన్సిలర్, పిఠాపురం.
జన గణన అవ్వకుండా ఎలా?
హైకోర్టును ఆశ్రయించిన
మాజీ కౌన్సిలర్లు
మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన
ఉన్నత న్యాయస్థానం


