సాక్షి ప్రతినిధి, కాకినాడ: రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు నాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ రైతుభరోసా పథకాన్ని రూపొందించింది. అర్హులైన అన్నదాతలకు ఏటా రూ.13,500 అందించేది. విత్తు నుంచి పంట దిగుబడుల విక్రయాల వరకూ అడుగడుగునా అండగా నిలిచేది. దీంతో, రైతులు నిశ్చింతగా వ్యవసాయం చేసుకునేవారు. ఈ పరిస్థితుల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో ఇదే పథకాన్ని కాపీ కొట్టారు. ‘అన్నదాత సుఖీభవ’గా పేరు మార్చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకూ కేంద్ర సాయంతో సంబంధం లేకుండా ఏటా ఏకంగా రూ.20 వేలు ఇస్తామని ఆర్భాటంగా ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని తుంగలోకి తొక్కేసి, రైతులకు మొండిచేయి చూపించారు.
తొలి ఏడాది రూ.300 కోట్లకు ఎగనామం
గద్దెనెక్కిన తొలి ఏడాది అన్నదాత సుఖీభవ పథకానికి ఎగనామం పెట్టేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ లెక్కల ప్రకారమే చూసుకున్నా జిల్లాలో ఈ పథకానికి అర్హులుగా గుర్తించిన 1.50 లక్షల మంది రైతులకు సుమారు రూ.300 కోట్ల మేర ఎగ్గొట్టారు. రెండో సంవత్సరానికి వచ్చేసరికి అర్హుల ఎంపికలో సవాలక్ష నిబంధనలు పెట్టి, లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టారు. జిల్లాలో సుమారు 1.75 లక్షల మంది రైతులున్నారు. కానీ, సుమారు 1,50,475 మందినే అర్హులుగా గుర్తించారు. పోనీ వీరికై నా ఇస్తామన్న రూ.20 వేలు ఇచ్చారా అంటే ఆ ఊసే లేకుండా పోయింది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో కలిపి రూ.14 వేలకే పరిమితం చేశారు. ఆవిధంగా చంద్రబాబు ప్రభుత్వం రూ.6 వేలు ఎగ్గొట్టేసింది. తద్వారా రూ.90,28,50,000 మేర ఎగ్గొట్టేశారు. హామీలు అమలు చేయరని తెలిసి కూడా చంద్రబాబు మాటలు నమ్మి, మరోసారి మోసపోయామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా, శుక్రవారం పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో కలిపి అన్నదాత సుఖీభవ సాయం రూ.84.80 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ నిర్వాకంతో అర్హులైన సుమారు 25 వేల మంది రైతులు ఈ పథకానికి దూరమైపోయారని రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కౌలు రైతుల నోట మట్టి
అన్నదాత సుఖీభవ పథకానికి కౌలు రైతులను దూరం చేసి వారి నోట ప్రభుత్వం మట్టి కొట్టిందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 60 వేల మంది కౌలు రైతులుంటారని అంచనా. వీరిలో చాలా మందికి ప్రభుత్వం కౌలు గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదు. ఫలితంగా వారు ఎరువులు, పంట రుణాల వంటివి ఇవ్వలేదు. గత్యంతరం లేక కౌలు రైతులందరూ ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని సాగు పెట్టుబడి పెట్టుకోవాల్సిన దుస్థితిలో కూరుకుపోయారు. జిల్లాలో అన్నివిధాలా అర్హత ఉన్న కౌలు రైతులు దాదాపు 25 వేల మంది ఉంటారని కౌలు రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. వీరిలో ఏ ఒక్కరికీ అన్నదాత సుఖీభవ సాయం అందలేదు. కౌలుదార్లతో పాటు సాధారణ రైతులను కలుపుకొంటే దాదాపు 50 వేల మంది రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపించింది.
నాడు అర్హులందరికీ జగన్ భరోసా
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ రైతులకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండదండగా నిలిచారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్రం ఇస్తున్న రూ.6 వేలకు నాటి జగన్ ప్రభుత్వం మరో రూ.7,500 కలిపి మొత్తం రూ.13,500 చొప్పున అర్హులైన రైతులకు ఏటా అందించేది. ఆవిధంగా జగన్ ఐదేళ్ల పాలనలో కేవలం రైతు భరోసా ద్వారానే జిల్లాలోని రైతులకు రూ.1,121 కోట్ల మేర లబ్ధి చేకూరింది. కౌలు రైతులకు సైతం రైతు భరోసా వర్తింపజేసి ఆదుకున్నారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. దీంతోపాటు వైఎస్సార్ సున్నా వడ్డీ, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి పలు పథకాల ద్వారా రైతులకు జగన్ సర్కార్ నాడు కొండంత అండగా నిలిచింది.
జగన్ ఐదేళ్ల పాలనలో
జిల్లా రైతులకు లబ్ధి ఇలా..
సంవత్సరం రైతుల లబ్ధి
సంఖ్య (రూ.కోట్లు)
2019-20 1,70,698 181.02
2020-21 1,66,963 216. 22
2021-22 1,62,125 214.43
2022-23 1,69,989 190.71
2023-24 1,74,229 250.36
హామీ అమలు చేయరా?
పెద్దాపురప్పాడుకు చెందిన రైతు తీపర్తి సత్యనారాయణ వద్ద 1.15 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాను. గత ఏడాది జూన్‌లో 11 నెలల కాలవ్యవధితో రెవెన్యూ అధికారులు కౌలు గుర్తింపు కార్డు ఇచ్చారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రైతు భరోసా పథకంలో ఏటా రూ.13,500 చొప్పున ఇచ్చారు. ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. రైతులతో సమానంగా కౌలు రైతులకు కూడా ప్రభుత్వ పథకాలు, పంట రుణాలు అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలవుతున్నా ఇంతవరకూ కౌలు రైతులను గుర్తించిందీ లేదు, అన్నదాత సుఖీభవ పథకం ఇచ్చిందీ లేదు. కూటమి నాయకుల మాటలు నమ్మి అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చాక ఇస్తానని పెట్టుబడుల కోసం వడ్డీలకు అప్పు చేశాం. దానికి వడ్డీ పెరగడమే తప్ప బాబు సర్కారు పైసా కూడా ఇవ్వలేదు. ఇచ్చిన కౌలు గుర్తింపు కార్డులు నాలుక గీసుకోవడానికి కూడా ఉపయోగపడటం లేదు. కౌలు రైతులను గుర్తించి, పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా, ఇతర ప్రయోజనాలు వర్తింపజేయాలి.
– మారెళ్ల వెంకట రమణ, యండమూరు, కరప మండలం
కౌలు రైతుకు తీరని అన్యాయం
నేను కౌలుకు వ్యవసాయం చేస్తున్నాను. అన్నదాత సుఖీభవ కింద రైతులందరికీ చంద్రబాబు ప్రభుత్వం రూ.20 వేలు ఇస్తామన్నారు. తీరా చూస్తే వారికి మూడు విడతల్లో రూ.14 వేలు మాత్రమే ఇవ్వడం దారుణం. మా కౌలు రైతులకు ఎలాగూ ఇవ్వలేదు.. కనీసం సాధారణ రైతులకై నా ఇస్తామన్న రూ.20 వేలు ఇచ్చి ఉండాల్సింది. వైఎస్సార్ సీపీ హయాంలో మా కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయం అందింది. ప్రస్తుతం నాలాంటి కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతంలో మోంథా తుపానుతో తీవ్రంగా నష్టపోతే నష్ట పరిహారం ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ ఇవ్వలేదు. పంటల బీమా భారం రైతుల మీదే వేశారు. ఈ ప్రభుత్వంలో ఎరువుల కొరత, గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోతున్నాం.
– ఇంటి వెంకట్రావు, వీకే రాయపురం, సామర్లకోట మండలం
అన్నదాత సుఖీభవ నిధుల విడుదల
ఈ పథకానికి 25 వేల మంది
రైతులు దూరం
మరో 25 వేల మంది
కౌలు రైతులకూ మొండిచేయి
మోసపోయామంటూ రైతుల గగ్గోలు


