పెదపూడి: జి.మామిడాడలో ప్రసిద్ధి చెందిన వారాహి మాతకు అమెరికాకు చెందిన గూగుల్ సంస్థ డైరెక్టర్ శేష సతీష్, ఆశాకిరణ్ దంపతులు సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు హారాన్ని శుక్రవారం సమర్పించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, వారాహి మాత దయతో తమ కుటుంబానికి మేలు జరిందని, కృతజ్ఞతగా ఈ హారం సమర్పించామని చెప్పారు. తన బంధువు, ఆలయ కమిటీ ప్రతినిధి సబ్బెళ్ళ శ్రీనివాసరెడ్డి (చంటిబాబు) దంపతుల ద్వారా అమ్మవారి విశిష్టతను తెలుసుకున్నానన్నారు. దాత దంపతులకు ప్రధానార్చకులు నారాయణ నంబూద్రి, శుక్లా, రాంబాబు తదితరులు వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేసి, సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్తి భగవాన్‌రెడ్డి, కోశాధికారి డీఆర్‌కే రెడ్డి, ద్వారంపూడి వెంకటరెడ్డి (చింతపండు), మండ రాజారెడ్డి, ప్రత్యూష మురళి, యువరాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పట్టు వస్త్రాల సమర్పణ
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి విశాఖపట్నానికి చెందిన సీఎంఆర్ అధినేత మావూరి వెంకట రమణ రూ.లక్ష విలువైన పట్టు వస్త్రాలను శుక్రవారం సమర్పించారు. వీటిని ఈ నెల 19న ఉగాది పర్వదినం నాడు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరులకు, అలాగే, ఈ నెల 27న శ్రీరామ నవమి వేడుకల్లో సీతారాములకు, ఇతర ఉపాలయాల్లోని దేవతామూర్తులకు అలంకరించాలని కోరారు. ఈ మేరకు ఈఓ వి.త్రినాథరావు అధికారులకు ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ కమిషనర్ బాబూరావు, ఏఈఓ కృష్ణారావు, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకుడు సుధీర్, వ్రత పురోహిత సంఘం మాజీ అధ్యక్షుడు నాగాభట్ల రవిశర్మ తదితరులు పాల్గొన్నారు.


