బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నగరంలోని వివిధ ట్రాన్స్‌పోర్ట్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన సీపీఎం నేత దువ్వ శేషుబాబ్జీ అధ్యక్షతన స్థానిక సుందరయ్య భవన్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. ప్రైవేటు ఫిట్‌నెస్ సెంటర్లను రద్దు చేయాలని, రవాణా శాఖ ఆధ్వర్యంలోనే ఫిట్‌నెస్ జరగాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల నివారణ, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లకే అవగాహన కల్పిస్తున్నారని, సొంత వాహనదారులకు, ముఖ్యంగా విద్యార్థులకు ఈ అవగాహన కల్పించాలని సూచించారు. సుదూర ప్రాంతాల్లో ప్రమాదాలకు గురై మరణించిన డ్రైవర్ భౌతికకాయాన్ని ఇంటికి చేర్చే ఏర్పాటు ప్రభుత్వమే చేయాలన్నారు. ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు మాత్రమే వెహికల్ లొకేషన్ ట్రేసింగ్ డివైజ్ ఏర్పాటు చేస్తున్నారని, వ్యక్తిగత వాహనాలకు దీనిని వేయడం లేదని అన్నారు. ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటోలకు ఆయిల్ వేయించి, నెలకు రూ.26 వేలు చెల్లిస్తే 60 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ సీ్త్రశక్తి పథకంలో భాగస్వాములవుతామని తెలిపారు. రవాణా రంగ రక్షణపై ప్రభుత్వానికి విన్నవిస్తూ సంతకాలు సేకరించాలని, ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు సమర్పించాలని తీర్మానించారు. ఈ నెల 24న కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి, వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎలిపే శ్రీనివాస్, మట్టా తిరుమల వెంకటరెడ్డి, లక్ష్మీ గణపతి ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మరుకుర్తి నాగబాబు, టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు వాలిశెట్టి శ్రీనివాస్, కోశాధికారి కె.సత్తిబాబు, స్మార్ట్ సిటీ ప్యాసింజర్ ఆటో యూనియన్ నాయకుడు నురుకుర్తి సూర్యప్రకాష్ పాల్గొన్నారు.


