అరాచకంపై దళిత గళం | - | Sakshi
Sakshi News home page

అరాచకంపై దళిత గళం

Mar 11 2026 7:30 AM | Updated on Mar 11 2026 7:30 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దమనకాండ, అరాచకానికి వ్యతిరేకంగా దళితులు గళమెత్తనున్నారు. ఈ దిశగా చేపట్టే ఉద్యమ కార్యాచరణకు కాకినాడ వేదిక కానుంది. స్థానిక సినిమా రోడ్డులోని సూర్య కళా మందిర్‌లో బుధవారం వైఎస్సార్‌ సీపీ ఎస్సీ విభాగం కార్యవర్గ వర్క్‌షాప్‌ (చర్చ) నిర్వహించనున్నారు. చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన ఏడాదిన్నర కాలంలో అధికార పార్టీ నేతలు సాగిస్తున్న దాడులు, దౌర్జన్యాలు, దళితులపై అన్యాయంగా ఎడాపెడా పెడుతున్న అక్రమ పోలీసు కేసులు, అత్యాచారాలు, గాడి తప్పిన పాలన, సంక్షేమాన్ని విస్మరించడం, ఎస్సీ వర్గాల అభ్యున్నతి, హక్కుల పరిరక్షణ తదితర అంశాలపై ఈ సందర్భంగా నేతలు చర్చించనున్నారు. పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్‌రాజా అధ్యక్షతన బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా భవిష్యత్‌ కార్యాచరణపై కార్యకర్తలకు నేతలు దిశానిర్దేశం చేస్తారు. ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పార్టీ ఎస్సీ సెల్‌ 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.

విస్తృత ఏర్పాట్లు

సాధారణంగా ఇటువంటి చర్చ, భవిష్యత్‌ కార్యాచరణ వంటి కీలక కార్యక్రమాలు తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతూంటాయి. దీనికి భిన్నంగా బయట ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. అది కూడా కాకినాడలో ఈ వర్క్‌షాప్‌ నిర్వహిస్తూండటంతో విస్తత ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని పార్టీ ముఖ్యులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుధాకర్‌బాబు పర్యవేక్షణలో శెట్టిబత్తుల కుమార్‌రాజా ఆధ్వర్యాన ఉమ్మడి తూర్పు గోదావరి జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, పార్టీ అంగన్‌వాడీ వర్కర్స్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత తదితరులు వర్క్‌షాప్‌ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రం నలుమూలల నుంచీ తరలివచ్చే పార్టీ ఎస్సీ నేతలకు చర్చకు అనువైన రీతిలో సూర్య కళామందిర్‌లో వేదిక ఏర్పాటు, సౌకర్యాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ కో ఆర్డినేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎస్‌ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్‌ తదితరులు పర్యవేక్షించారు. పార్టీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లకు ఆహ్వానం పంపించారు.

·˘ నేడు కాకినాడలో వైఎస్సార్‌ సీపీ

ఎస్సీ విభాగం వర్క్‌షాప్‌

·˘ భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం

·˘ తరలి రానున్న ముఖ్య నేతలు, శ్రేణులు

విజయవంతం చేయండి

రాష్ట్ర స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న ఎస్సీ సెల్‌ వర్క్‌షాపును విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కదలి రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల ఎస్సీ సెల్‌ అధ్యక్షులు ఆయా జిల్లాల్లో ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ వర్క్‌షాప్‌లో నివేదికలు అందించి, చర్చకు పెట్టనున్నారు. జిల్లాలో తొలిసారి జరుగుతున్న ఈ వర్క్‌షాపునకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎస్సీ సెల్‌ ముఖ్య నేతలు, మండల, గ్రామ విభాగాల అధ్యక్షులు, కమిటీల ప్రతినిధులు తరలి రావాలి. ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్‌తో మొదలై మధ్యాహ్నం 3 గంటల వరకూ వర్క్‌షాప్‌ జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు పార్టీ ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశాం. – శెట్టిబత్తుల కుమార్‌రాజా, వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement