కాకినాడ రూరల్: స్థానిక ఏటిమొగ వద్ద ఉన్న రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ(ఎస్‌ఐఎఫ్‌టీ)లో త్రిపుర రాష్ట్రానికి చెందిన 38 మంది విద్యార్థులకు వారం రోజుల శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. మత్స్య రంగంలోని అత్యాధునిక సాంకేతికతపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించేందుకు వారికి ఈ ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఎస్.అంజలి తెలిపారు. శిక్షణలో భాగంగా ఎస్‌ఐఎఫ్‌టీలోని ల్యాబ్‌లు, నావిగేషన్ సాంకేతికత, తీర ప్రాంత రక్షణలో మడ అడవుల ప్రాముఖ్యత, ఆవశ్యకత, సముద్రంలో చేపల వేటలో ఉపయోగించే వివిధ యాంత్రీకరణ పద్ధతులు, హార్బర్ల నిర్వహణపై అవగాహన కల్పిస్తామని వివరించారు. అసిస్టెంట్ డైరెక్టర్ కె.శ్రావణి కుమారి కో ఆర్డినేటర్‌గా, ఎఫ్‌డీఓ పి.దత్తాత్రేయ అసిస్టెంట్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు,
ఏలేరులో స్వల్పంగా
తగ్గిన నీటి నిల్వలు
ఏలేశ్వరం: ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, మంగళవారం 80.02 మీటర్లుగా నమోదైంది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, 13.48 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. ఆయకట్టుకు 1,200, విశాఖపట్నానికి 225, పంపాకు 50, తిమ్మరాజు చెరువుకు 20 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ఎండల తీవ్రత పెరిగితే జలాశయంలో నీటి నిల్వలు మరింతగా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫిజిక్స్ పరీక్షకు
18,432 మంది హాజరు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మంగళవారం ఫస్టియర్ ఫిజిక్స్ పరీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఈ పరీక్షకు 18,432 మంది హాజరవగా, 649 మంది గైర్హాజరయ్యారు. అన్ని కేంద్రాల్లోనూ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అబ్జర్వర్ జ్యోతుల రాంబాబు తెలిపారు.
అందుబాటులో
హెచ్‌పీవీ వ్యాక్సిన్
కాకినాడ క్రైం: జిల్లాలో హెచ్‌పీవీ (హ్యూమన్ ప్యాపిలోమా వైరస్) వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక కొండయ్యపాలెంలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి నరసింహ నాయక్‌తో కలసి వ్యాక్సిన్ పంపిణీని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మంగళవారం ప్రారంభించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో భాగంగా తొలి దశలో 14 ఏళ్ల బాలికలకు మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నట్లు నాయక్ తెలిపారు. ఈ వయసు బాలికలు జిల్లాలో 15,413 మంది ఉన్నారని పేర్కొన్నారు.
తెలుగు వర్సిటీకి
వేటూరి సాహిత్య సంపుటాలు
రాజమహేంద్రవరం రూరల్: ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి సాహిత్య సంపుటాలను స్థానిక పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి బహూకరించారని వైస్ చాన్సలర్ ఆచార్య డి.మునిరత్నంనాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేటూరి సాహిత్యాన్ని 6 సంపుటాలు – 8 గ్రంథాలుగా అమెరికాలోని వేటూరి సాహిత్యభిమాన సమితి వారు 2026 జనవరిలో తొలిసారిగా ప్రచురించారన్నారు. దొరకునా ఇటువంటి సేవ (వాల్యూమ్–1), మానసవీణా మధుగీతం (వాల్యూమ్–2), నవమి నాటి వెన్నెల (వాల్యూమ్–3), ఎడారి కోయిల (వాల్యూమ్–4), ఝమ్మంది నాదం (వాల్యూమ్–5), ఎరక్కపోయి వచ్చాను (వాల్యూమ్–6) గ్రంథాలతో పాటు గతంలో ప్రచురించిన వేటూరి పుస్తకాలు ‘కొమ్మకొమ్మకో సన్నాయి’, ‘రాబిన్‌హుడ్’,‘జీవనరాగం’, ‘సిరికాకొలను చిన్నది’ సంపుటాలను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులకు, పరిశోధకులకు అందుబాటులో ఉండే విధంగా ఆచార్య మునిరత్నంనాయుడుకు సుందరరామమూర్తి కుమారుడు వేటూరి రవిప్రకాష్ మంగళవారం అందజేశారు. రాజమహేంద్రవరం సాహిత్యపీఠంలో డాక్టర్ పొన్నా లీలావతి పర్యవేక్షణలో జయంతి చక్రవర్తి అనే విద్యార్థి వేటూరి సుందరరామమూర్తి పాటలు – సాహిత్యపు విలువలు అనే అంశంపై పీహెచ్‌డీ కోసం పరిశోధన చేసి పట్టా అందుకోవడం విశేషమని ఆచార్య మునిరత్నంనాయుడు పేర్కొన్నారు.


