● రత్నగిరిపై వివాహాల జోరు
● ఎటు చూసినా నవదంపతులే..
● సత్యదేవుని సన్నిధికి వస్తున్న
భక్తుల్లో సగం మంది పెళ్లి జనాలే..
అన్నవరం దేవస్థానం
అన్నవరం: ఎక్కడ విన్నా పెళ్లిబాజాల మోత.. ఎటు చూసినా కొంగుముడి వేసుకున్న కొత్త దంపతులు.. సత్యదేవుడు వెలసిన రత్నగిరిపై కొ న్నాళ్లుగా ప్రతి రోజూ ఇదే దృశ్యం కనిపిస్తోంది. వందల సంఖ్యలో నవ దంపతులు.. ఆ స్వామి వ్రతాలాచరిస్తూ వ్రత మండపాలు, క్యూలు, ఆలయ ప్రాంగణం.. ఇలా ఏవైపు చూసినా వారే కనిపిస్తున్నారు. దీంతో, మూడు వారాలుగా రత్నగిరి కొత్త శోభను అద్దుకుంటోంది.
మూఢమి ముగియడంతో..
గత ఏడాది నవంబర్ 30న మొదలైన శుక్ర మూఢమి.. మాఘ మాసం ముగియడానికి ఐదు రోజుల ముందు.. అంటే గత నెల 13వ తేదీన ముగిసింది. వివాహాలకు దివ్యమైన మాసంగా పేర్కొనే మాఘంలో మూఢం కారణంగా వివాహాది శుభకార్యాలు జరగలేదు. ఫిబ్రవరి 19 నుంచి మాత్రమే వివాహాలు జరుగుతున్నాయి. మార్చి నెలలో ఊపందుకున్నాయి. దీంతో, మూడు వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి జరగని ఊరు.. శుభలేఖ అందుకోని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఎన్నాళ్లో వేచిన బంధం అన్నట్టుగా.. అనేక జంటలు మంచి ముహూర్తంలో ఓ ఇంటివారవుతున్నారు. మూఢంతో మూడు నెలల పాటు ఇబ్బంది పడిన పురోహితులు, క్యాటరింగ్, సన్నాయి మేళం, వివాహ మండపాలు, పుష్పాలంకరణ చేసేవారు, ఫొటోగ్రాఫర్లు చేతినిండా పని దొరకడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
రోజూ పెళ్లిసందడే..
రత్నగిరిపై ఇంచుమించు ప్రతి రోజూ వందకు తక్కువ కాకుండా వివాహాలు జరుగుతున్నాయి. ఆ నవదంపతులతో పాటు ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు, వారి బంధుమిత్రులు రత్నగిరికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. సత్యదేవుని సన్నిధిలో ఎక్కడ చూసినా ప్రతి రోజూ వందల సంఖ్యలో కొంగుముడి వేసుకున్న కొత్త దంపతులే సందడి చేస్తున్నారు. రత్నగిరి ఆలయ ప్రాంగణంతో పాటు సత్యగిరిపై శ్రీ సత్య శ్రీనివాస ఏసీ కల్యాణ మండపం, ఎంఎస్ రెడ్డి అంజనీ వివాహ వేదికల్లో ఉన్న చెరో 12 మినీ కల్యాణ మండపాల్లో జోరుగా వివాహాలు జరుగుతున్నాయి. దీంతో, ఆ ప్రాంతమంతా పెళ్లిబాజాలతో ప్రతిధ్వనిస్తోంది. వీటికి తోడు సత్యగిరిపై విష్ణు సదన్‌లోని 36 హాళ్లలో కూడా జోరుగా వివాహాలు జరుగుతున్నాయి.
కొండ దిగువన సైతం..
అన్నవరంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న హోటల్ దగ్గర నుంచి గ్రామంలో మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న వివిధ లాడ్జిల వరకూ ఉన్న 25 కల్యాణ మండపాల్లో కూడా పెద్ద సంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. ఆయా ముహూర్తాలకు రెండు నెలలు ముందుగానే ఈ కల్యాణ మండపాలను పెళ్లి బృందాలు రిజర్వ్ చేసుకుంటున్నాయి. ఇక్కడ వివాహ మండపం, భోజనాల హాలు, గదులకు కలిపి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ అద్దె వసూలు చేస్తున్నారు. ఈ వ్యాపారం లాభసాటిగా ఉండటంతో మరో 10 వివాహ మండపాల నిర్మాణాలు చురుకుగా జరుగుతున్నాయి. ఒక్కో కల్యాణ మండపం నిర్మాణానికి రూ.4 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ అవుతున్నా ఎక్కడా ఖర్చుకు వెనుకాడటం లేదు.
నవ దంపతులకు ఉచిత
అంతరాలయ దర్శనమేదీ?
ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ 2023–24లో అన్నవరం దేవస్థానం ఈఓగా ఉన్నప్పుడు నవ దంపతులకు ఉచిత అంతరాలయ దర్శనం కల్పించాలని ఆదేశాలిచ్చారు. ఆ తరువాత ఆ ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు. నవ దంపతులను కూడా రూ.200 టికెట్టుతోనే అంతరాలయ దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో, వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన వారిని మాత్రమే అంతరాలయ దర్శనానికి పంపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు దీనిని మార్చాల్సి ఉంది.
ఈ సందడి.. మరో 3 నెలలు
మరో మూడు నెలల వరకూ అంటే జూన్ వరకూ వివాహాలు జరగనున్నాయి. జూన్‌లో ఆషాఢ మాసం కావడంతో వివాహాలు జరగవు. దీంతో, ఈ మూడు నెలల్లో వివాహాలు చేసుకునేందుకు దేవస్థానంలోని వివిధ సత్రాల్లోని గదులను, వివాహాలు నిర్వహించుకునే హాళ్లను పెళ్లిబృందాలు రిజర్వ్ చేసుకుంటున్నాయి. అలాగే, వివాహ మండపాలు ఏర్పాటు చేసేవారు, పురోహితులు, పుష్పాలంకరణ చేసేవారు, క్యాటరింగ్ సిబ్బంది, మంగళ వాయిద్యాల బృందాల వారిని కూడా ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. వచ్చే మూడు నెలల్లో రత్నగిరిపై సుమారు 2 వేల వివాహాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 19న పరాభవ నామ సంవత్సర ఉగాది, 27న శ్రీరామ నవమి వేడుకల అనంతరం వివాహాల జోరు మరంత పెరగనుంది. ఏప్రిల్ 18 నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఆ నెలలో కూడా పెద్ద సంఖ్యలో వివాహాలు జరుగుతాయని పండితులు తెలిపారు.


