కరప: ఎక్కడైనా, ఎవరైనా బాణసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ హెచ్చరించారు. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చేంత వరకూ బాణసంచా తయారీ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. స్థానిక అధికారులతో కలసి నడకుదురు, వేళంగి గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. బాణసంచా తయారీ కేంద్రాలను తనిఖీ చేసి, తయారీదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఆయా కేంద్రాల్లో ఏమైనా మందుగుండు సామగ్రి తయారు చేస్తున్నారా, మూసి ఉంచారా అనే విషయాన్ని పరిశీలించారు. వేట్లపాలెం దుర్ఘటన దృష్ట్యా జిల్లాలో ఎక్కడా బాణసంచా తయారు చేయకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మండలంలో ఎక్కడా బాణసంచా తయారీ, అమ్మకాలు జరగకుండా నిఘా పెట్టాలని, నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తుమ్మల దుర్గాప్రసాద్, కరప ఎస్సై టి.సునీత, ఆర్‌ఐ పవన్ తదితరులు పాల్గొన్నారు.


