అన్నవరం: సత్యదేవుని నూతనాలయ వార్షికోత్సవం రత్నగిరిపై మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి నూతనాలయం 14 వసంతాలు పూర్తి చేసుకుని, 15వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా దేవస్థానంలో ఈ వేడుకలు జరిగాయి. వేద పండితులు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ సత్యదేవునికి లక్ష తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. ఈ కార్యక్రమాలను వేద పండితులు యనమండ్ర శర్మ, ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, ఉప ప్రధానార్చకుడు ఇంద్రగంటి వెంకటేశ్వర్లు తదితరులు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు కదంబ ప్రసాదం పంచి పెట్టారు. 2012 మార్చి 14న జరిగిన సత్యదేవుని నూతనాలయ శిఖర ప్రతిష్ఠలో పాల్గొన్న ఐదుగురు విశ్రాంత పండితులు శ్రీపాద రాజశేఖరశర్మ, శ్రీపాద వేంకట రామ సుబ్రహ్మణ్య శర్మ, చాడ శేషగిరిరావు, కోటమర్తి సత్యనారాయణమూర్తి, మహేంద్రవాడ సత్యనారాయణమూర్తిలను ఈఓ వి.త్రినాథరావు ఘనంగా సత్కరించారు. వారికి సత్యదేవుని ప్రసాదం, ఫొటో, పారితోషికం అందజేశారు. వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి ఆలయాన్ని, ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.


