రాజమహేంద్రవరంలో రేపు మెగా జాబ్ మేళా
● మాజీ ఎంపీ భరత్ రామ్
ఆధ్వర్యంలో నిర్వహణ
● హాజరుకానున్న 70 కంపెనీలు
● సుమారు 3 వేల ఉద్యోగాలు
భర్తీ చేసే అవకాశం
రాజమహేంద్రవరం సిటీ: నగరంలోని హోటల్ మంజీరా సరోవర్‌లో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ, ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ మార్గాని భరత్ రామ్ అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ జాబ్ మేళాకు 70 కంపెనీల ప్రతినిధులు రానున్నారని, దాదాపు 3 వేల మందికి ఉద్యోగాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జాబ్‌మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ అవకాశాన్ని రాజమహేంద్రవరం నగరంలో పాటు సమీప గ్రామాల్లోని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలన్నారు. ఫార్మా, రిటైల్, మాన్యు ఫ్యాక్చరింగ్, హాస్పిటళ్లు, నర్సింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, బీపీఓ, అకౌంట్స్ మేనేజ్‌మెంట్, సేల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నికల్, మాల్స్, అడ్మినిస్ట్రేషన్, వేర్ హౌసింగ్ తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్ , బి.ఫార్మసీ, ఎంబీఏ, పీజీ చదివినవారు అర్హులని తెలిపారు. జాబ్‌మేళాలో పాల్గొనడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నమోదు చేసుకోవాలని, లేదా నేరుగా జాబ్ మేళాకు వచ్చి రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉందన్నారు.


