ద్రోణుని వయసు అశీతి పంచక
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ద్రోణుని వయసు ‘అశీతి పంచక’’ (ఐదు ఎనభైలు అంటే 400 ఏళ్లు) అని వ్యాసుడు పేర్కొన్నాడని, కానీ దీన్ని కొందరు ఆక్షేపిస్తున్నారు, నాటి ఆయుఃప్రమాణాలు వేరని, వాటిని నేటి లెక్కలతో సరిచూడరాదని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. హిందు సమాజంలో గురువారం ఆయన వ్యాసభారతంపై 43వ రోజు ప్రవచనాన్ని కొనసాగించారు. ద్రోణుడు అయోనిజుడు, కురుపాండవుల చిన్నతనంలో కలసిన నాటికే ఆయన వృద్ధుడు, భారత యుద్ధం నాటికి పాండవులు ఇంచుమించు 80–90 ఏళ్ల ప్రాయంలో ఉన్నారు. కృష్ణుడు 120 సంవత్సరాలు జీవించాడు, కానీ ఆయనది మానుషాతీతమైన దివ్యస్వరూపమని సామవేదం వివరించారు. సైంధవ వధ జరిగిన ఒక్క రోజు యుద్ధాన్ని అతి విస్తారంగా వ్యాసుడు వివరించాడు. ఆ రోజున జరిగినది మహాయుద్ధం, ఇరుపక్షాల్లో అనేక మంది వీరులు నేలకూలారు. కృష్ణుడు తన యోగశక్తితో సూర్యుని కప్పివేశాడు, చాలామంది భావిస్తున్నట్టు చక్రం పెట్టి అడ్డుకోలేదన్నారు. సూర్యాస్తమయం జరిగిందని భావించిన సైంధవుని శిరసును అర్జునుడు ఖండించాడు, కృష్ణుని సూచనపై సైంధవుని శిరసు సుదూరంలో సంధ్యోపాసన చేస్తున్న తండ్రి ఒడిలో పడేటట్టు అర్జునుడు అస్త్రాన్ని ప్రయోగించాడు. ఇందుకు పూర్వవృత్తాంతాన్ని కృష్ణుడు వివరిస్తాడు. తండ్రి ఒడిలోని శిరస్సు అప్రయత్నపూర్వకంగా నేలమీద పడడంతో తండ్రి తల వందముక్కలైందని, అర్జునుని ప్రతిన నెరవేరిందని సామవేదం అన్నారు. ముందుగా భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ శివకేశవుల అభేదతత్త్వాన్ని భారతం చెబుతున్నదని, తిక్కన సోమయాజి ఆంధ్రానువాదం ప్రారంభిస్తూ చెప్పిన ‘శ్రీయన గౌరి’ పద్యం ఈ సత్యాన్ని నిరూపిస్తోందన్నారు.


