రికార్డుల తయారీపై అవగాహన
సామర్లకోట: పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులు రికార్డుల తయారీపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని విస్తరణ శిక్షణ కేంద్రం (ఈటీసీ) వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ అన్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న 12 జిల్లాల్లోని డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులకు రెండురోజుల పాటు నిర్వహించే శిక్షణను గురువారం ఆయన ప్రారంభించారు. గ్రామాల్లో చేపట్టే కార్యక్రమాలను, ఆర్థిక కార్యకలాపాల వివరాలను సకాలంలో నమోదు చేయడం వల్ల అభివృద్ధి పనుల అంచనాలు తయారు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఈ రికార్డులు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడానికి, ప్రజలకు అవసరమైన సరిఫికెట్లు జారీ చేయడానికి , సమాచార హక్కు చట్టం ప్రకారం ఎవరైనా కోరితే అఽందించడానికి రికార్డులు దోహదపడతాయని చెప్పారు. శిక్షణకు హాజరైన 120 మంది ఉద్యోగులకు క్షేత్రస్థాయి పర్యటనలు ఏర్పాటు చేశారు. నాలుగు బృందాలుగా ఏర్పాటు చేసి ఆయా గ్రామాల పర్యటనకు ప్రిన్సిపాల్ కేఎన్‌వీ ప్రసాదరావు ఏర్పాట్లు చేశారు. సామర్లకోట మండలంలో వేట్లపాలెం, పెద్దాపురం మండలంలో జి.రాగంపేట, కాకినాడ రూరల్ మండలంలో కొవ్వాడ, ఆత్రేయపురం మండలంలో ర్యాలి, ముమ్మిడివరం మండలంలో అనాతవరం, కిర్లంపూడి మండలంలో బూరుగుపూడి, గోకవరం గ్రామా ల్లో ఉద్యోగులు పర్యటించారు. పారశుధ్యం, రికార్డుల నిర్వహణ, ఇతర కార్యక్రమాల అమలును ఈ బృందాలు పరిశీలించాయి. ఈ కార్యక్రమాలలో డీడీఓ ఎస్‌ఎస్ శర్మ, ఎంపీడీఓలు శేషుబాబు, కె.సుశీల, ఫ్యాకల్టీ రామకృష్ణ పాల్గొన్నారు.


