తగ్గిన న్యూ ఇయర్ జోష్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: 2025కు వీడ్కోలు పలుకుతూ 2026కు స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర వేడుకలు ఒక మోస్తరుగా సాగాయి. నగదు మారకం తగ్గి జనంలో కొనుగోలు శక్తి పడిపోవడంతో నూతన సంవత్సర వేడుకలలో జోష్ తగ్గింది. కొత్త సంవత్సరంతో పాటు సంక్రాంతికి రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో వస్త్ర వ్యాపారంలో కొంతలో కొంత ఊపు కనిపించింది. జిల్లా కేంద్రం కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ సహా పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని పట్టణాలు, మండలాల్లో డిసెంబరు 31 బుధవారం రాత్రి మందుబాబులు అప్పులు చేసి మరీ మద్యం మత్తులో ఊగిపోయారు. మందు, ముక్క లేకుండా నూతన సంవత్సర వేడుకలు ఏమిటంటూ మద్యం దుకాణాల వద్ద ఎగబడ్డారు. స్వీట్ షాపులు, న్యూ ఇయన్ గ్రీటింగ్స్ దుకాణాలలో అమ్మకాలు ఒక మోస్తరుగానే జరిగాయి. ఎక్కడా లేని హడావుడి, హంగామా మద్యం దుకాణాల వద్ద స్పష్టంగా కనిపించింది. లిక్కర్ షాపుల నిర్వాహకులు మూడు రోజులు ముందుగానే ఇండెంట్‌లు పెట్టుకుని మద్యం నిల్వ చేసుకున్నారు. జిల్లాలో కాకినాడ నగరం, కాకినాడ రూరల్, తుని, పిఠాపురం నియోజకవర్గాల్లో లిక్కర్ షాపుల్లో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరిగాయి. పొగమంచును సైతం మందుబాబులు లెక్క చేయలేదు. బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచే మద్యం దుకాణాల వద్ద హడావుడి మొదలైంది. మందుబాబుల హంగామా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఒంటి గంట వరకు మద్యం దుకాణాల వద్ద కనిపించింది. నూతన సంవత్సర వేడుకల్లో రోడ్లపై ఇష్టమొచ్చినట్టు బైక్ రేస్‌లు చేస్తే తాటతీస్తామంటూ ఎస్పీ బిందుమాధవ్ హెచ్చరించారు. అయినా యువకులు అర్ధరాత్రి సమయంలో బైక్‌లపై హల్‌చల్ చేశారు. పీకల దాకా మందు తాగి యువకులు మెయిన్‌రోడ్డు, టెంపుల్ స్ట్రీట్ తదితర రోడ్లపై బైక్ రేస్‌లతో హంగామా చేశారు. ‘మూడు బ్రాందీ బాటిళ్లు, ఆరు బీరు బాటిళ్లు’ అన్న చందంగా మద్యం వ్యాపారం సాగింది. జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద అర్ధరాత్రి వరకు మందుబాబులు బారులు తీరి కనిపించారు.
మద్యం షాపుల వద్ద కోలాహలం
కాకినాడ నగరం, కాకినాడ రూరల్‌లో కొండయ్యపాలెం ఫ్‌లై ఓవర్ జంక్షన్, టీటీడీ కల్యాణ మండపం, సర్పవరం, వలసపాకలు, ఏటిమొగ తదితర ప్రాంతాల్లో బ్రాందీషాపులు కోలాహలంగా కనిపించాయి. జిల్లాలో బ్రాందీ షాపుల నిర్వాహకులు సామర్లకోట డిస్టిలరీ నుంచి మూడు రోజులు ముందు నుంచే దుకాణాలకు బ్రాందీ, బీర్లు తరలించారు. గడచిన మూడు రోజులుగా డిస్టిలరీ నుంచి జరిగిన లావాదేవీలు గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కల్లుగీత కార్మికులకు కేటాయించిన దుకాణాలతో కలిపి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన మద్యం దుకాణాలు 170 వరకు ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా 37 దుకాణాలు కాకినాడ నగరంలోనే ఉన్నాయి. కాకినాడ సిటీతో కలసి ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో 12 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. వాస్తవానికి రోజు వారీ రూ.3 లక్షలకు తగ్గకుండా కౌంటర్ సేల్ ఉంటేనే దుకాణాలు లాభదాయకంగా ఉంటాయి. సాధారణ రోజు ల్లో ఈ బెంచ్ మార్క్ దాటే దుకాణాలు జిల్లాలో 20 నుంచి 30 షాపులు మాత్రమే ఉంటాయని చెబుతున్నా రు. మిగిలిన షాపుల్లో డైలీ కౌంటర్ సేల్ రూ.2లక్షలు లోపేనంటున్నారు. డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకల పేరుతో మద్యం ఏరులై పారింది. మద్యం దుకాణాల వద్ద సాయంత్రం నుంచే సందడి వాతావరణం మొదలై రాత్రి 9 గంటలకు ఊపందుకుని అమ్మకాలు పెరిగాయి. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో షాపులలో బాటిల్‌పై రూ.10 పెంచి అమ్మకాలు చేశారని బ్రాందీ షాపుల వద్ద మందుబాబులు కిక్కెక ్కిన తరువాత శాపనార్థాలు పెట్టడం కనిపించింది. కాగా, నూతన సంవత్సర వేడుకల కోసం జిల్లా కేంద్రం కాకినాడ సహా ఎక్కడబడితే అక్కడ ఇన్‌స్టెంట్ బిర్యానీ సెంటర్లు పుట్టుకొచ్చాయి. రోడ్లపక్కన కాంబో ప్యాక్ అంటూ ప్రత్యేక ఆఫర్లతో కౌంటర్లు పెట్టి వివిధ రకాల బిర్యానీలు విక్రయించారు.
జనంలో కొనుగోలు శక్తి
పడిపోవడమే కారణం
తగ్గిన నగదు మారకం
అయినా మద్యం అమ్మకాలదే పైచేయి!
మూడు రోజుల ముందే నిల్వలు
అప్పోసొప్పో చేసి మందుబాబుల జల్సా
మూడు రోజులుగా జిల్లాలో అమ్మకాలు ఇలా (కేస్‌లలో)..
తేదీ ఐఎంఎల్ బీర్‌లు రాబడి
(రూ.కోట్లలో)
29–12–25 8,607 3,392 6.96
30–12–25 8,213 3,874 6.91
31–12–25 7,041 3545 6.13
తగ్గిన న్యూ ఇయర్ జోష్
తగ్గిన న్యూ ఇయర్ జోష్


