బుచ్చయ్య వ్యాఖ్యలు హాస్యాస్పదం
● పొట్టేళ్ల నరికివేత మొదలైంది
చంద్రబాబు ప్రభుత్వంలోనే..
● విలేకరులతో మాజీ మంత్రి వేణు
రాజమహేంద్రవరం రూరల్: సోషల్ మీడియా, ఏఐను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ జనసేన పార్టీకి చెందిన దేవరాజ్ ఆయన వదినను తోస్తే దానిని వైఎస్సార్ సీపీ నాయకుడు చేశాడంటూ హోంమంత్రి అనిత తప్పుడు ప్రచారం చేశారన్నారు. మరుసటిరోజు స్వయాన అతని అక్క తన తమ్ముడు దేవరాజ్ జనసేన పార్టీ కార్యకర్త అని, చేతిపై పవన్ కల్యాణ్ టాటూ ఉంటుందని తెలిపిందన్నారు. అలాగే వైఎస్సార్ సీపీకి చెందిన రవిచంద్రారెడ్డి బీజేపీలో చేరితే అతడి మూడేళ్ల క్రితం కేక్ కటింగ్ వీడియోను చూపించి హోంమంత్రి తప్పుడు ప్రచారం చేశారన్నారు. పొట్టేళ్ల నరికివేత మొదలైంది చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడేనన్నారు. 2024 జూన్ ఏడున బాలకృష్ణ చిత్రపటానికి 25 పొట్టేళ్ల తలకాయలను దండగా వేశారన్నారు. అలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్ చిత్రపటాలకు గొర్రె, పొట్టేలును నరికి రక్తాభిషేకం చేసిన వీడియోలను సైతం చెల్లుబోయిన వేణు చూపించారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజున గొర్రెపోతును నరికారని చట్ట ప్రకారం కొందరిని అరెస్టు చేశారన్నారు. కానీ పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని వారిని కొట్టి హోంమంత్రికి వీడియో చూపించడంతో పాటు రోడ్డుపై నడిపించడం జరిగిందన్నారు. చివరకు వెహికల్స్ లేకపోవడంతో నడిపించాల్సి వచ్చిందని డీజీపీతో చెప్పించారన్నారు. మేము కానీ తలుచుకుంటే రోడ్డుమీద తిరగగలరా అంటూ బుచ్చయ్య వ్యాఖ్యానించడం దారుణమన్నారు.
చెలరేగిపోతున్న మాఫియా
నియోజకవర్గంలో మట్టి, ఇసుక, మద్యం, రేషన్ బియ్యం మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోందన్నారు. ఉచిత ఇసుక ఎక్కడా లభించడం లేదన్నారు. ఏ ఇసుక లారీని అడిగిన బుచ్చయ్య తాలూకా అంటూ సమాధానం ఇస్తున్నారన్నారు. అలాగే మధ్యం ధరలు అధికంగా అమ్మడంతో బెల్టుషాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయన్నారు. గంజాయిని అరికట్టామంటూ చెబుతున్నారని, కానీ విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. దీని వల్ల సమాజ వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోయాయన్నారు. వైఎస్ జగన్‌ను తిడితే లోకేష్ దృష్టిలో పడి ఉన్నతమైన అవకాశం వస్తుందని గోరంట్ల ఆశపడుతున్నారన్నారు. యువత నిరుద్యోగభృతి, మహిళలు ఆడబిడ్డ నిధి, రైతులు పంటకు గిట్టుబాటు ధర కోసం ఎదురుచూస్తున్నారన్నారు.


