ఎరువు.. కరవు | - | Sakshi
Sakshi News home page

ఎరువు.. కరవు

Aug 29 2025 6:21 AM | Updated on Aug 29 2025 6:21 AM

ఎరువు

ఎరువు.. కరవు

ఖరీఫ్‌ రైతుకు కష్టకాలం

నిల్వలున్నాయంటున్న అధికారులు

ఒక రైతుకు ఒకే బస్తా

ఆయకట్టు అంతా ఇదే దుస్థితి

కళ్లు తెరవని కూటమి సర్కార్‌

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఖరీఫ్‌ రైతులు పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అసలే మెట్ట ప్రాంతం అఽధికంగా ఉన్న కాకినాడ జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన తొలినాళ్లలో సాగునీరు కోసం రైతులు నరకం చూశారు. అదను దాటిపోతుందనే ఆందోళనలో ఉన్న సమయంలో కనాకష్టం మీద రెండు వారాలు ఆలస్యంగా సాగునీరు అందించారు. నారుమళ్లకు స్వస్తి పలికి వెదజల్లే విధానంతో 70 శాతం ఆయకట్టులో రైతులు గట్టెక్కారు. ఆ సమస్య తీరిందనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఎరువుల కొరతతో రైతులు కష్టాల కడలిలో ఎదురీదుతున్నారు. కూటమి సర్కార్‌కు ముందుచూపు కొరవటమే ఎరువుల కొరతకు ప్రధాన కారణమని రైతు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు.

తప్పని కుస్తీలు

మునుపెన్నడూ చూడని ఎరువుల కొరత జిల్లాలో ఖరీ్‌ఫ్‌ రైతులను వేధిస్తోంది. ఎరువుల కోసం రైతులు పడుతున్న పాట్లు చెప్పనలవికాదు. జిల్లాలో రైతులకు కావలసిన ఎరువులు అందివ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఒక రైతుకు ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్న ప్రభుత్వ నిర్వాకంపై రైతులు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో కాకినాడ జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలనేది జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించింది. జిల్లాలో 13,055 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రైతులకు అవసరమైన ఎరువులు దొరకడం గగనంగా ఉంది. ఒక రైతుకు ఒక బస్తా మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. ఇలా కోటా మాదిరిగా ఇస్తుండడంతో రైతుసేవా కేంద్రాల వద్ద కొట్లాటలకు దిగుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. ‘తాంబూలం ఇచ్చాం..తన్నుకు చావండన్న’ చందంగా ఐదారు వందల బస్తాలు అవసరమైన ప్రాంతానికి 100 లేదా 150 బస్తాలు యూరియా తీసుకువచ్చి మమ అనిపిస్తున్నారు. దీంతో రైతులు కుస్తీపోటీలకు వచ్చినట్టు తొక్కిసలాడుకుంటున్నారు. కోటా ప్రకారం ఇచ్చే ఒక్క బస్తా తప్ప అదనంగా రైతు అవసరానికి తగ్గట్టు ఒక్క కేజీ ఎరువు కూడా ఇవ్వలేని ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.

ఎన్ని ఎకరాలు ఉన్నా ఒకే బస్తా

జిల్లాలో ఏ రైతు సేవాకేంద్రం లేదా, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద యూరియా, డీఏపీ బస్తాల కోసం గంటల తరబడి క్యూ లో నిరీక్షించి విసుగెత్తిపోయి రైతులు చివరకు ఇళ్లకు తిరిగివెళ్లిపోతున్నారు. జిల్లాలో సుమారు 300 పీఏసీఎస్‌లు ఉన్నా 10 శాతం చోట్ల కూడా ఎరువులు విక్రయించడం లేదు. ఇటీవల పెద్దాపురం, పిఠాపురం, జగ్గంపేట, కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో ఎరువుల కోసం రైతులు రైతు సేవా కేంద్రాల వద్ద కొట్లాటకు దిగిన ఉదంతాలు ఉన్నాయి. వరి సాగు జిల్లాలో దాదాపు 90 శాతం పూర్తి అయ్యిందని వ్యవసాయాధికారులే చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఒక రైతుకు ఒక బస్తా అనే విధానంలో అరకొరగా ఎరువులు పంపిణీ చేస్తోంది. ఒక ఎకరా సాగుచేసిన రైతుకు, ఐదు ఎకరాలు సాగు చేసిన రైతుకు ఒకే బస్తా చొప్పున ఇస్తున్నారు. ఇలా అయితే ఖరీఫ్‌ సాగు ఎలా ముందుకు వెళుతుందని రైతులు నిలదీస్తున్నారు. ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా ఎరువులు సరఫరా చేయలేకపోవడంతో గత్యంతరం లేక బయట మార్కెట్లో అధిక ధరలకు కొనుక్కోవాల్సివస్తోందని రైతులు లబోదిబోమంటున్నారు. బస్తాకు రూ.50 నుంచి రూ.100 అదనంగా చెల్లించి కొనుక్కోవాల్సి వస్తోందంటున్నారు.

పట్టాదార్‌ పాస్‌ పుస్తకం చూపినవారికే అమ్మాలి

ఖరీఫ్‌లో ఎకరాకు బస్తా డీఏపీ (డై అమ్మోనియం ఫాస్పేట్‌), బస్తా యూరియా (నత్రజని), 15 కిలోలు పొటాష్‌(మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌) వంతున రసాయనిక ఎరువులు వినియోగించాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది. ఇవేమీ పట్టించుకోని రైతులు రెండు బస్తాల యూరియా, డీఏపీ రెండు బస్తాలు వినియోగిస్తారు. పీఏసీఎస్‌లలో, రైతు సేవాకేంద్రాలలో ఆధార్‌కార్డు తీసుకొచ్చిన వారికి ఎరువులు విక్రయించడంతో అసలైన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో కూటమి నేతలు దొడ్డిదారిన రైతులు కానివారిని ఆధార్‌కార్డుతో పంపించి యూరియా బస్తా కొనుగోలు చేసి బయట బస్తాకు రూ.50 నుంచి రూ.100 ఎక్కువకు అమ్మకాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధార్‌కార్డు ప్రామాణికంగా కాకుండా పట్టాదార్‌ పాస్‌ పుస్తకం చూసి ఎరువులు విక్రయించాలని రైతు ప్రతినిధులు పేర్కొంటున్నారు.

యూరియాకు పొటాష్‌తో లింకు

యూరియా బస్తా కావాలంటే పొటాష్‌ తప్పనిసరిగా రూ.1,700 పెట్టి కొనుగోలు చేయవలసిన పరిస్థితి. 10 ఎకరాల భూమిని సాగు చేస్తున్నా. ఈ పది ఎకరాలకు సుమారు ఐదు బస్తాలు యూరియా కావలసి వచ్చింది. యూరియా కావాలంటే పొటాష్‌ కొనుగోలు చేయాలని ప్రాథమిక సహకార సంఘంలోనే నిబంధన పెట్టడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితి ఎదురుకాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పండిన ధాన్యం అమ్ముకోవడంలోనే కాకుండా ఖరీఫ్‌ సీజన్‌లో పంట పండించుకోవడానికి ఎరువుల కోసం కూడా రోడ్డెక్కే పరిస్థితి దాపురించింది.

– మోరంపూడి రమేష్‌, రైతు, జి.మేడపాడు, సామర్లకోట మండలం.

పది ఎకరాలు సాగు

చేస్తున్నా..

నేను పది ఎకరాల్లో వరిసాగు చేస్తున్నాను. ఇప్పటి వరకూ ఒకసారి కూడా పొలానికి పిండి వేయలేదు. గత పదిరోజులుగా పిండి కోసం తిరుగుతున్నాను. ఈ రోజు రైతు భరోసా కేంద్రానికి యూరియా వచ్చింది. ఒక్క బస్తా ఇస్తానంటున్నారు. నాకు 10 బస్తాలు యూరియా కావాలి. ఈ ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నట్లు ఫీలవుతోంది. రైతులకు ఎరువులు కూడా సరఫరా చేయలేని పరిస్థితుల్లో ఉంది.

– వీరచక్రవాసు, రైతు,

సామర్లకోట మండలం

చాలా ఇబ్బంది పడుతున్నాం

గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఎరువులు కావాల్సినా ఇచ్చేవారు. ప్రస్తుతం ఎరువుల కోసం రోజుల తరబడి ఇక్కడే క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. పదిరోజులుగా యూరియా కోసం వేసిచూస్తే ఒక్క బస్తా మాత్రమే ఇస్తామంటున్నారు. నేను ఐదు ఎకరాలు వరి సాగు చేస్తున్నాను. ఒక బస్తా పట్టుకొని ఏ పొలంలో చల్లాలో అర్థం కావడం లేదు. ఈ ప్రభుత్వానికి రైతుల బాధలు తెలియడం లేదు.

– తుమ్మల చిట్టిబాబు, రైతు,

చంద్రపాలెం, సామర్లకోట మండలం

ఏమీ పట్టని కూటమి నేతలు

ఎరువుల కొరతతో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు జిల్లాలో పాలక పక్ష నేతలకు బొత్తిగా పట్టడంలేదు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే ఎరువుల కొరత ఏర్పడిందంటున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందుగానే ఎంత ఆయకట్టులో వరి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఎంత ఎరువు అవసరం అవుతుందో గుర్తించే బాధ్యత జిల్లా వ్యవసాయ అధికారులదే. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం జిల్లాకు కేటాయింపులు చేసి గోదాంలలో ఎరువులు నిల్వ చేయాల్సి ఉంది. ఇదివరకు ఎప్పుడూ వ్యవసాయశాఖ యంత్రాంగం ప్రణాళికా వైఫల్యం చూడలేదంటున్నారు. ప్రైవేటు డీలర్లు అధిక ధరలకు విక్రయించకూడదని, ఎరువుల అమ్మకాలకు గుళికలు, ఇతర మందులను లింక్‌ పెట్టవద్దనే ఆదేశాలు గాలిలో కలిసిపోయి రైతులను కష్టాల్లోకి నెట్టేశారు. హోల్‌సేల్‌ డీలర్లు లింక్‌పెట్టి ఇస్తుంటే రిటైల్‌ అమ్మకాల్లో రైతులకు లింక్‌పెట్టి అమ్ముకోకపోతే తాము వాటిని ఎలాభరిస్తామని డీలర్లు వాపోతున్నారు. ప్రభుత్వమే కంపెనీలరె పర్యవేక్షిస్తూ లింక్‌ పెట్టకుండా ఎరువులు సరఫరా చేయాలన్న నిబంధన అమలుచేస్తే ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయాలు జరుపుతామని డీలర్లు అంటున్నారు. కంపెనీవాళ్లే ఎరువులను ఎమ్మార్పీ ధరలకు డీలర్లకు ఇచ్చి, ధవళేశ్వరం నుంచి తెచ్చుకోమంటున్నారని చెబుతున్నారు. ధవళేశ్వరం నుంచి బస్తాకు రూ.35 రవాణా వ్యయమై ఎమ్మార్పీకి మించి బస్తాకు రూ.30 నుంచి రూ.40 ఎక్కువకు అమ్మకపోతే నష్టపోతామని డీలర్లు పేర్కొంటున్నారు. కంపెనీలపై ప్రభుత్వం పర్యవేక్షణ పక్కాగా ఉంటే బ్లాక్‌ను అరికట్టవచ్చు. ఇదివరకు కాకినాడలో ఎన్‌ఎఫ్‌సీఎల్‌ ఉన్నప్పుడు ఎరువుల కొరత అనేది ఉత్పన్నమయ్యేదే కాదంటున్నారు.

ఎరువు.. కరవు1
1/3

ఎరువు.. కరవు

ఎరువు.. కరవు2
2/3

ఎరువు.. కరవు

ఎరువు.. కరవు3
3/3

ఎరువు.. కరవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement