
క్రీడాకాశంలో తూరుపు మెరుపులు
కపిలేశ్వరపురం: ఆటలు మానసిక, శారీరక ఉల్లాసాన్నే కాకుండా దేశ కీర్తి ప్రపంచ వ్యాప్తం చేస్తాయి. సాధించిన ప్రగతి పది కాలాల పాటు దేశ ఔన్నత్యాన్ని పెంపొందించేలా చేస్తాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందుతోంది. క్షేత్ర స్థాయిలో పాఠశాల స్థాయి నుంచే ప్రభుత్వాలు క్రీడలకు సరైన సదుపాయాలు, అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
జాతీయ క్రీడా దినోత్సవం నేపథ్యమిదీ...
ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1905లో జన్మించిన భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జన్మదినం ఆగస్టు 29వ తేదీని జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్నను శ్రీమేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారంశ్రీగా నేటి మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాదిలో అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఆ పురస్కారాన్ని అందుకోవడం ఉమ్మడి ‘తూర్పు’ జిల్లాకు గర్వకారణం.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్రీడలకు మహర్దశ
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2023–28 క్రీడా పాలసీ ద్వారా ఆడుదాం ఆంధ్రా క్రీడల సంబరాన్ని నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4వేల సచివాలయాల పరిధిలో మూడు లక్షల మ్యాచ్‌లను నిర్వహించింది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వలేనంతగా విజేతలకు నగదు బహుమతులను అందజేసింది. 2023 సెప్టెంబర్ 1 నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో 9 క్రీడా అంశాలపై పోటీలు నిర్వహించింది.
ఉమ్మడి జిల్లాలో ప్రగతి ఇదీ..
● ఈ ఏడాది మార్చిలో గుజరాత్ సూరత్‌లో నిర్వహించిన అంతర్జాతీయ వీల్ చైర్ క్రికెట్ టీ–10 మానస్ కప్ టోర్నీలో ఏపీ జట్టు ప్రతిభ కనబరచగా, 15 మంది జట్టు సభ్యుల్లో ఎనిమిది మంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వారే.
● ఈ ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 8 వరకూ రాజస్తాన్ అల్వార్‌లో నిర్వహించిన 44వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2024 పోటీల్లో అమలాపురానికి చెందిన రెడ్డి నరేంద్రకుమార్, జి.గంగరాజు రన్నింగ్‌లో అంతర్జాతీయ అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యారు.
● అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం రామచంద్రపురానికి చెందిన గిరిజన క్రీడాకారిణి కుంజా రజిత మేలో ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పరుగు పోటీలో స్వర్ణం సాధించింది.
● ఈ ఏడాది జనవరి 6 నుంచి 9 వరకూ సింగపూర్‌లో నిర్వహించిన ఏషియన్ యోగా పోటీల్లో దేవరపల్లి మండలం చిన్నాయగూడేనికి చెందిన ఇమ్మణి అర్మిత భవానీ చౌదరి ప్రతిభ కనబర్చింది.
● ఈ ఏడాది జూలైలో అమలాపురం మండలం సవరప్పాలేనికి చెందిన సత్తి అక్షయ కర్ణాటక ఒపెన్ చెస్ చాంపియన్‌షిప్ గెలుచుకుని జాతీయ స్థాయికి ఎంపికై ంది.
● ఈ నెల 1 నుంచి 12 రోజుల పాటు కాకినాడ డీఎస్‌ఏ మైదానంలో 15వ జాతీయ జూనియర్ మహిళా హాకీ చాంపియన్‌షిప్–2025 నిర్వహించారు. 2026–27 వరల్డ్ కప్ జట్టు ఎంపికకు 30 మందిని ప్రాబబుల్స్‌గా ఎంపిక చేశారు.
● ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26 వరకూ తాడేపల్లిగూడెంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు.
● ఈ ఏడాది జనవరి 14 నుంచి 17 వరకూ రామచంద్రపురంలో నిర్వహించిన 14వ ఆలిండియా బాస్కెట్‌బాల్ టోర్నీ నిర్వహించారు.
● 2024 డిసెంబర్ 28న వైజాగ్ ఆర్‌కే బీచ్‌లో ప్రారంభమై సముద్రంలో 150 కిలోమీటర్లు ఈదుతూ స్విమ్మర్ గోలి శ్యామల 2025 జనవరి 3 కాకినాడ బీచ్‌కు చేరుకుని అరుదైన రికార్డును సాధించారు.
● ఈ ఏడాది జూలైలో రాజోలుకు చెందిన బండారు అయ్యప్ప, గుడాల దుర్గా శ్రీనివాస్ సురేష్‌కుమార్‌లు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)కు ఎంపికయ్యారు.
● ఈ ఏడాది మార్చి 23న చైన్నెలో కాకినాడకు చెందిన ఫాస్ట్ బౌలర్ పెన్మత్స వెంకట సత్యనారాయణరాజు ముంబయి ఇండియన్స్ జట్టు తరఫున తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.
● అమలాపురం విక్టరీ అకాడమీకి చెందిన కొండా శివేంద్ర, పితాని రాఘవేంద్ర, సాధనాల శ్రీసంతోష్ చెస్‌లో అంతర్జాతీయ రేటింగ్ సాధించారు.
● ఈ ఏడాది జనవరి 7 నుంచి 9 వరకూ మండల స్థాయిలోనూ 22 నుంచి 24 వరకూ అమలాపురంలో జిల్లా స్థాయిలోనూ కోనసీమ క్రీడోత్సవం పేరిట విద్యార్థులకు పోటీలను నిర్వహించారు.
● ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకూ ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో శివరాత్రి జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించింది.
న్యాయ నిర్ణేతలుగా..
ఈ ఏడాది జూలైలో వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెట్ కమిషన్ సభ్యులుగా రాజమహేంద్రవారానికి చెందిన జాతీయ బీచ్ వాలీబాల్ క్రీడాకారిణి యండమూరి లలితాదేవి ఎన్నికయ్యారు.
● ఈ ఏడాది ఫిబ్రవరి 9–13 మధ్య ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానిలో నిర్వహించిన జాతీయ స్థాయి ఫెన్సింగ్ క్రీడలకు న్యాయ నిర్ణేతగా కాకినాడ జిల్లాకు చెందిన నాగం సతీష్ నియమితులయ్యారు.
● ఈ ఏడాది జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14వరకూ నిర్వహించిన నేషనల్ గేమ్స్‌లో బాల్ బ్యాడ్మింటన్ అంపైర్లుగా అమలాపురం మండలానికి చెందిన అడపా శ్రీనివాస్, గొల్లకోటి శ్రీనివాస్ నియమితులయ్యారు.
దిగ్భ్రాంతి కలిగించిన ప్రముఖుల మృతి
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ తండ్రి కాశీ విశ్వనాథ్ ఈ ఏడాది ఫిబ్రవరి 20న మృతి చెందారు. సాత్విక్ ఫిబ్రవరి 21న దిల్లీలో ప్రధాని చేతుల మీదుగా ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకునే కార్యక్రమానికి బయలుదేరిన కొద్ది సేపటికే ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మే 1న దిల్లీలో కేంద్ర మంత్రి మాండవీయ చేతులు మీదుగా ఆ పురస్కారాన్ని అందుకోగా ఆ ఘట్టాన్ని తల్లి రంగనాయకి స్వయంగా వీక్షించారు. అమలాపురానికి చెందిన వెటరన్ అథ్లెటిక్ క్రీడాకారుడు బిళ్ళ వీర్రాజు (74) అనారోగ్యంతో ఈ ఏడాది ఏప్రిల్ 14న మృతి చెందారు.
ఆటల్లో మేటిగా
గోదావరి క్రీడాకారులు
జాతీయ, అంతర్జాతీయ
పోటీలకు వేదికగా ఉమ్మడి జిల్లా
అదే స్థాయిలో పతకాల కై వసం
నేడు జాతీయ క్రీడా దినోత్సవం
కూటమి పాలనలో
తూతూ మంత్రంగా ..
సుమారు ఏడాదిన్నర కూటమి పాలనలో క్రీడలను విస్మరించారు. క్షేత్ర స్థాయిలో మైదానాలను మెరుగుపరచలేదు. 2024 నవంబర్ 20న నూతన క్రీడా విధానం– 2024ను ప్రభుత్వం ఆమోదించినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఉమ్మడి జిల్లాలో అథ్లెట్లు సాధన చేసేందుకు సింథటిక్ ట్రాక్, కోచ్ సదుపాయాలు లేకపోవడం ప్రోత్సాహలేమికి ఉదాహరణ.

క్రీడాకాశంలో తూరుపు మెరుపులు