
విద్యుత్ చార్జీల భారాలు రద్దు చేయాలి
● ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు
ఉపసంహరించుకోవాలి
● వామపక్ష నాయకుల డిమాండ్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న విద్యుత్ చార్జీల ధరలకు వ్యతిరేకంగా విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పోరాడుతామని వామపక్షాల నాయకులు గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రతిజ్ఞ చేశారు. తొలుత 2000 ఆగస్టు 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో జరిగిన విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామిల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకు ప్రయోగశాలగా మార్చి ప్రజలపై భారీగా విద్యుత్ భారం వేసినప్పుడు వామపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా చారిత్రాత్మకమైన పోరాటం నిర్వహించాయన్నారు. ఉద్యమం పతాక స్థాయిలో ఉండగా 2000 ఆగస్టు 28న హైదరాబాద్‌లో జరిగిన కాల్పుల్లో అమరులైన వారి స్ఫూర్తితో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారీగా వేస్తున్న విద్యుత్ చార్జీల భారాలకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. ట్రూ అప్ చార్జీలు, సర్దుబాటు చార్జీలు, సెకీ ఒప్పందం, టైం ఆఫ్ ది డే విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్‌లను బిగించడం ఆపాలన్నారు. సీపీఐ (ఎంఎల్) జిల్లా నాయకులు సీహెచ్ నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం అదానీతో 20 సంవత్సరాల పాటు లక్ష కోట్ల రూపాయల ఒప్పందం చేసుకొందన్నారు. ప్రజలకు అత్యవసరమైన విద్యుత్ అవసరాన్ని అవకాశంగా తీసుకుని భారాలు వేయడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోదీ, అదానీ వైపు ఉంటుందా, రాష్ట్ర ప్రజల వైపు ఉంటుందా తేల్చుకోవాలన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, సీపీఐఎం లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ, రైతు కూలీ సంఘ నాయకులు వల్లూరి రాజబాబు, సీపీఎం నగర కార్యదర్శి పలివెల వీరబాబు పాల్గొన్నారు.