
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎరువుల కోసం రైతులు రోడ్డు ఎక్కుతున్నా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని మాజీ మంత్రి, వైసస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. గురువారం ఆయన కాకినాడలో విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి సాగునీటికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. పక్షం రోజులుగా ఎరువుల కొరతతో రైతులు నరకం చూస్తున్నారని ఆక్షేపించారు.
గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇటువంటి దుస్థితి రైతులు ఎదుర్కోలేదన్నారు. ఎప్పుడూ లేనిది ఎక్కడా చూడనిది ఒక రైతుకు ఒక బస్తా కోటాగా ఇవ్వడం అన్యాయమని, స్థానిక నాయకులు సిఫారసు ఉంటేనే యూరియా ఇచ్చే పరిస్థితి చూస్తున్నామని, ఇంతటి దౌర్భాగ్య పరిస్థితికి కూటమి సర్కారు కారణమని ఆరోపించారు. ఐదు ఎకరాలు సాగు చేసుకుంటున్నా రైతుకు ముష్టిపడేసినట్లు ఒక బస్తా యూరియా ఇస్తే పంట సాగు ఎలా చేస్తాడని రాజా ప్రశ్నించారు. కూటమి నేతలు ఎరువుల వ్యాపారులతో కుమ్మకై ్క బ్లాక్ మార్కెట్లో ఎరువులు పెద్ద ఎత్తున విక్రయాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం కళ్లు ఉండి కబోదిలా వ్యవహరిస్తోందని విమర్శించారు.
జిల్లాలో పిఠాపురం, పెద్దాపురం తదితర నియోజకవర్గాల్లో ఎరువుల కోసం రైతులు గంటల తరబడి ఎండలో ఎదురుచూస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. ఎరువుల కొరత లేదని నిస్సిగ్గుగా చంద్రబాబు చెబుతున్నారని, అసలు ఈ ప్రభుత్వానికి రైతులపై జాలి, దయ ఉన్నాయా అని రాజా నిలదీశారు. ప్రభుత్వానికి రైతులంటే అంత కక్ష సాధింపు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా అయిదేళ్లు రైతే రాజు అనే నినాదంతో రైతు భరోసా పథకం పక్కాగా అమలు చేశారన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా రైతులకు సాయం అందించడంలో కూడా నిలువునా మోసం చేశారని రాజా మండిపడ్డారు.