
నేడు జాబ్‌మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో శనివారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి జి.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. టాటా లైఫ్ ఇన్సూరెన్స్, న్యూలెర్న్ ఎడ్యుటెక్, అపోలో ఫార్మశీ సంస్థలు 133 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయన్నారు. పదవ తరగతి, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, ఫార్మశీ ఉత్తీర్ణులైన వారు హాజరుకావవచ్చని, వివరాలకు 86398 46568 నంబరులో సంప్రదించవచ్చన్నారు.
వైఎస్సార్ సీపీ అనుబంధ
విభాగాల్లో ముగ్గురికి చోటు
బోట్‌క్లబ్ (కాకినాడి సిటీ): వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో కాకినాడ జిల్లాకు చెందిన ముగ్గురికి చోటు కల్పించారు. విద్యార్థి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉయ్యూరి వీర ప్రసాద్ (నాని), ముమ్మిడి శ్రీనివాస్‌ను, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధిగా గుళ్ల ఏడుకొండలును నియమించారు.
పారదర్శకంగా ధ్రువపత్రాల పరిశీలన
పిఠాపురం: డీఎస్సీ సాధించిన వారి ధ్రువపత్రాల పరిశీలన పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అబ్జర్వర్, ఏపీ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ మువ్వ రామలింగం తెలిపారు. ఆయన గురువారం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో డీఎస్సీ సాధించిన వారి ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో కులధ్రువీకరణ పత్రాలను రెవెన్యూ శాఖ పరిశీలించగా మిగిలిన విద్యార్హత సర్టిఫికెట్లను విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారన్నారు. ఈ పరిశీలనంతా అభ్యర్థులు ఆన్‌లైన్లో పొందుపరిచిన జాబితా ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి ఉద్యోగ అర్హత నిర్ణయిస్తామని చెప్పారు. ఈ కేంద్రంలో 1,351 మంది సర్టిఫికెట్లు పరిశీలించాల్సి ఉండగా తొలి రోజు గురువారం 1,029 మంది తమ సర్టిపికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. వారిలో గురువారం రాత్రి 10 గంటలకు 750 పైగా పూర్తయ్యాయి. మిగిలినవి పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మిగిలిన వారి సర్టిఫికెట్లు శుక్రవారం పరిశీలించనున్నారు. ఆయన వెంట డీఈవో రమేష్ డీసీఈబీ వెంకట్రావు, ఎంఈఓ 2 శివప్రసాద్, మల్లం హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు గాజుల మురళి భాస్కర్ గొల్లప్రోలు ఎస్సై నౌడు రామకృష్ణ తదితరులున్నారు.
నేడు ఐటీఐ అడ్మిషన్లకు కౌన్సెలింగ్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో శుక్రవారం ఐటీఐ కళాశాలలో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఐటీఐ అడ్మిషన్ల కన్వీనర్ ఎంవీ వేణుగోపాల్‌వర్మ గురువారం తెలిపారు. అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉదయం 8 గంటలకు విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. ప్రైవేట్ ఐటీఐలకు దరఖాస్తు చేసుకున్నవారు శనివారం హాజరుకావాలని, వివరాలకు 0884–2348182 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.