
హామీలు అమలు చేయాలంటూ ధర్నా
బోట్‌క్లబ్ (కాకినాడ): రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు రజకులకు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద రజక వృత్తిదారుల సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తరతరాలుగా వెనుకబడి ఉన్న రజక వృత్తిదారులకు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, డిమాండ్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు కోనేటి రాజు మాట్లాడుతూ ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివించినా సరైన ఉద్యోగ అవకాశాలు లేవన్నారు. అందువల్ల ఆసుపత్రి, రైల్వే, ఆర్టీసీ, పోలీస్ శాఖల్లో రజకులకు కేటాయించిన పోస్టులను వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే వృత్తి ద్వారా 50 ఏళ్లకే అనారోగ్యానికి గురై బాధపడుతున్నామని, ఆ వృత్తిదారులకు పింఛన్ సదుపాయం కల్పించాలన్నారు.
పిఠాపురం అగ్రహారంలో ఉన్న దోబీఘాట్‌లో తరతరాలుగా వృత్తి చేసుకుని జీవనం సాగిస్తున్నామని అది శిథిలస్థితికి చేరిందని తక్షణమే మరమ్మతులకు నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
రజకులకు ఇచ్చిన హామీల్లో 250 యూనిట్లు ఉచిత కరెంటు, రజకులకు శాశ్వత నివాస ధ్రువపత్రాలు, వృత్తిదారులకు రూ.5 లక్షల రుణాల ఇచ్చి దానిపై 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోనేటి రాజు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌ను కలసి వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో వృత్తిదారులు సీహెచ్ శ్రీనివాస్, కొడమంచిలి అప్పన్న, దుమరసింగు దుర్గ, సామంతకుర్తి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.