
మాకు జీవనోపాధి కల్పించాలి
టాటా మ్యాజిక్ ఓనర్స్, డ్రైవర్స్ యూనియన్ నాయకుల వినతి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో తమకు జీవనోపాధి లేకుండా పోయిందని టాటా మ్యాజిక్ ఓనర్స్, డ్రైవర్స్ యూనియన్ నాయకు లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వాహనాలకు డీజిల్ వేయించి రోజుకి రూ.1,250 చెల్లించి మహిళల ఉచిత ప్రయాణంలో భాగస్వాములు చేయాలని కోరుతూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో అర్బన్ తహసీల్దార్ జితేంద్రకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు వాలిశెట్టి శ్రీను మాట్లాడుతూ టాటా మ్యాజిక్ వాహనాలకు మహిళా ప్రయాణికులే ఆధారమన్నారు. వాహనం తిరిగినా, తిరగకపోయినా ఏడుగురు ప్యాసింజర్లు గల వాహనానికి మూడు నెలలకు రూ.5,500, తొమ్మిది మంది ప్యాసింజర్లు ప్రయాణించే వాహనానికి రూ.7,200 ట్యాక్స్ చెల్లిస్తున్నామన్నారు. ఇవికాకుండా ఇన్సూరెన్స్, టోల్ ట్యాక్స్ తప్పదన్నారు. ప్రస్తుతం టాటా మ్యాజిక్ డ్రైవర్స్ పూర్తిగా రోడ్డున పడ్డామన్నారు. ఒడిశా రాష్ట్రంలో మాదిరి టాటా మ్యాజిక్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ ఉండాలన్నారు. టాటా మ్యాజిక్‌లతో పాటు ఇతర ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్స్ అందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ ఫిట్‌నెస్ సెంటర్ రద్దు చేసి ప్రభుత్వమే నిర్వహించాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరారు. తుని, కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ యూనియన్ నాయకులు రెడ్డి వీరబాబు, పి.సూర్యచక్రం, జి.రాజేష్, వాసంశెట్టి శ్రీనివాస్, పి.మణి, ఎ.సతీష్, బి.సత్యనారాయణమూర్తి, వి.హేమకుమార్ పాల్గొన్నారు.