
మరోసారి ఆగిన సర్వే
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఘాట్ రోడ్ పక్కనే పంపా రిజర్వాయర్‌ను ఆనుకుని ఉన్న నిర్మాణాల స్థల వివాదంపై మంగళవారం జిల్లా లాండ్ రికార్డులు, సర్వే శాఖ అధికారులు నిర్వహించిన జాయింట్ సర్వే మధ్యలో నిలిచిపోయింది. వివాద స్థలంలోకి దేవస్థానం ఈఓ, సిబ్బంది వెళ్లడానికి వీలు లేదని జూలై 31న పెద్దాపురం కోర్టు ఇంజక్షన్ ఆర్డర్స్ ఇచ్చిందని ఆ స్థలంలో హోటల్, బోట్‌షికారు నిర్వహిస్తున్న దాసరి హరగోపాల్ పెద్దాపురం ఆర్డీఓ కే రమణికి తెలపడంతో ఆమె కోర్టు ఆర్డర్స్ ఒరిజినల్ కాపీ తమకు అందజేయాలని ఆదేశించారు. అనంతరం సర్వేను నిలిపివేశారు. ఈ స్థల వివాదంపై జాయింట్ సర్వే చేయడం ఇది ఐదోసారి. అయినా ఫలితం తేలకపోవడం విశేషం.
దేవస్థానం, ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమక్షంలో జాయింట్ సర్వే
కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం పంపా రిజర్వాయర్ స్లూయిజ్ గేట్లు ఎదురుగా గల కొండ వద్ద నుంచి పవర్ హౌస్ వద్దకు వెళ్లే మార్గంలోని హరిణి బోట్ షికార్ నిర్మాణాల వరకు జాయింట్ సర్వే నిర్వహించారు. లాండ్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డి.భారతి, డిస్ట్రిక్ట్ లాండ్ రికార్డ్స్ అండ్ సర్వే డీఈ కె.శ్రీనివాస్, అన్నవరం దేవస్థానం ఈఓ సుబ్బారావు, ఈఈ రామకృష్ణ, ఏఈఓ శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ తరఫున ఈఈ శేషగిరిరావు హాజరయ్యారు. సర్వే సగం పూర్తయ్యాక పెద్దాపురం ఆర్డీఓ కే రమణి వచ్చి సర్వేను పరిశీలించారు. అదే సమయంలో లీజుదారుడు దీనిపై ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని చెప్పడంతో సర్వే అర్ధాంతరంగా నిలిపివేశారు.