
పీజీఆర్‌ఎస్‌కు 631 అర్జీలు
బోట్‌క్లబ్(కాకినాడ): ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సంతృప్తికరమైన పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్‌మీనా, ట్రైనీ కలెక్టర్ మనీషా, డీఆర్వో జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్‌వీవీ సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసు, సీపీవో పి.త్రినాఽథ్, జీజీహెచ్ ఎస్డీసీ ఎన్ శ్రీధర్ ఇతర అధికారులతో కలిసి హాజరై జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు, విన్నపాలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులోని పేర్లు మార్పులు, చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్‌లైన్లో నమోదు, రీ సర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, తల్లికి వందనం, ఆన్‌లైన్ సమస్యలు వంటి అంశాలకు సంబంధించి మొత్తం 631 అర్జీలు అందాయి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పరిష్కరించిన దరఖాస్తులను జిల్లా అధికారి ఆడిటింగ్ చేసి నివేదిక పంపించిన తర్వాత వాటిని రాష్ట్ర స్థాయిలో ఆడిట్‌కి పంపించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన అర్జీదారులు తమ అర్జీలను మీకోసం.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అర్జీల ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి టోల్‌ఫ్రీ నంబర్ 1100కి నేరుగా కాల్ చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.