
ఆర్డీఓకు అస్వస్థత
సామర్లకోట: పెద్దాపురం నియోజకవర్గంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనను పురస్కరించుకొని శుక్రవారం బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సమయంలో కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు అస్వస్థతకు గురయి ఒకసారిగా కుప్పకూలి పోయారు. వెంటనే ఆర్డీఓ సిబ్బంది స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ ట్రస్టు ఆస్పత్రికి తరలించామని తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. బీపీ కారణంగా అస్వస్థతకు గురి అయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని డాక్టర్లు తెలిపారు.
నేడు పెద్దాపురంలో
ముఖ్యమంత్రి పర్యటన
సామర్లకోట: స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దాపురంలో పర్యటిస్తున్నట్లు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆర్ కృష్ణకపర్ధి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు సామర్లకోట–పెద్దాపురం రోడ్డులోని లేఆవుట్‌లోని ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్‌లో దిగుతారు. అక్కడి నుంచి పెద్దాపురంలోని 10వ వార్డు నిర్మాణం చేసిన మేజిక్ డ్రైన్‌ను, స్వచ్ఛ రథంను సందర్శిస్తారు. శానిటరీ వర్కర్లకు ఇన్సూరెన్సు కిట్లు అందజేస్తారు. స్వచ్ఛ ర్యాలీలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.40 వరకు సామర్లకోట–పెద్దాపురం రోడ్డులోని లేఆవుట్‌లో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్ద స్టాల్స్ విజిట్ చేసి అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సమీపంలో ఉన్న పూర్ణా కల్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్‌లో తాడేపల్లి చేరుకొంటారు.
నవోదయ ప్రవేశాలకు
దరఖాస్తు చేసుకోండి
ప్రత్తిపాడు: పెద్దాపురం, ఎటపాకలలోని పీఎం శ్రీ జవహర్ నవోదయ పాఠశాలలో ఆరవ తరగతిలోకి ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తులను కోరుతున్నట్టు ప్రత్తిపాడు మండల విద్యాశాఖాధికారి వి.రాజబాబు తెలిపారు. పెద్దాపురం నవోదయ విద్యాలయ పరిధిలోని పెద్దాపురం, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, సామర్లకోట, పెదపూడి, జగ్గంపేట, కాజులూరు, కిర్లంపూడి, కరప, తాళ్ళరేవు, పిఠాపురం, గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి, గండేపల్లి మండల పరిధిలోని వారు, ఎటపాక నవోదయ విద్యాలయకు తుని, తొండంగి, కోటనందూరు, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, ఏలేశ్వరం మండలాలకు చెందిన విద్యార్థులు 2026–27 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ మొదలైందని చెప్పారు. ఆఖరు తేదీ ఈ నెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలని, డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష జరుగుతుందని చెప్పారు. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రదానోపాధ్యాయులు అర్హత కలిగిన విద్యార్థులను ఈనెల 27 లోగా దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు.
25న జాబ్ మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఈ నెల 25వ తేదీన జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి జి.వసంతలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఆశోక్ లేలాండ్ సంస్థ 40, టీమ్‌లీజ్ సర్వీస్ (బ్యాంక్ సర్వీస్) 220, పేటీఏం 200, సోలార్ సిస్టమ్ 100, క్రెడిట్ యాక్సెస్ 300 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయన్నారు. పదవ తరగతి ఆపైన ఐటీఐ, డిప్లమో, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు హాజరుకావవచ్చని, ఇతర వివరాలకు 86398 46568 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.
టీచర్ల అంతర్ జిల్లాల
బదిలీల షెడ్యూల్ విడుదల
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): టీచర్ల అంతర్ జిల్లా బదిలీలకు (భార్యాభర్తలు, పరస్పర అంగీకారం చేసుకునేవారికి మాత్రమే) ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. ఈ నెల24 వరకు ఆన్‌లైన్‌లో బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు ఫారం ప్రింటవుట్‌లను సంబందిత మండల విద్యాశాఖాధికారికి సమర్పించాలన్నారు. 22 నుంచి 25 వరకు మండల విద్యాశాఖాధికారి ధ్రువీకరిస్తారన్నారు. 28, 29 తేదీలలో పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయంలో తుది నిర్ధారణ జరుగుతుందన్నారు.