
మొట్టమొదటి మధ్యవర్తి శ్రీకృష్ణుడే
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఈ లోకంలో మొట్టమొదట మధ్యవర్తి శ్రీకృష్ణడేనని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. స్థానిక సూర్యకళామందిరంలో సరస్వతి గాన సభ ఆధ్వర్యంలో శ్రీసనాతన ధర్మం–శాశ్వత న్యాయంశ్రీ అంశంపై ఐదు రోజులుగా జరుగుతున్న ప్రవచనాలు శుక్రవారంతో ముగిశాయి. మన యోగ్యతను బట్టి మనకు సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. ధర్మరాజు నారదుడితో యథాశక్తి, యథావిధిగా చెప్పిన సనాతన ధర్మాన్ని మనం పాటించాలన్నారు. మన పూర్వీకులు ఈ విధానాన్నే ఆచరించారన్నారు. సత్యానికి కట్టుబడి ఉండడం, ఒడంబడికలకు విలువ ఇవ్వడం, మాటకోసం, సత్యం కోసం కట్టుబడడమే మన సంస్కృతి అన్నారు. గర్భవతి అయిన సీ్త్ర తన సంతానం కాపాడుకోవడానికి తనకిష్టమైన కొన్నింటిని ఎలా వదులుకుంటుందో పరిపాలకులు కూడా అలా ఉండాలన్నారు. అనంతరం సరస్వతీ గానసభ ఆధ్వర్యంలో సామవేదం షణ్ముఖ శర్మను సత్కరించారు. సరస్వతీ గాన సభ గౌరవ అధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి, అధ్యక్షుడు పేపకాయల రామకృష్ణ పాల్గొన్నారు.