
వాడపల్లిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
● తరలివచ్చిన మహిళలు
● పూజా సామగ్రిని సమకూర్చిన దేవస్థానం
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకన్న క్షేత్రంలోని ఉత్తర ప్రాంగణంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహించారు. సుమారు రెండు వేల మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చకులు వాడపల్లి రవికిరణ్, ఖండవిల్లి సాయిరామకృష్ణ తదితరులు ఉదయం కల్యాణ మంటపం వేదికపై వరలక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు పండితుల మంత్రోచ్ఛారణ మధ్య డీసీ అండ్ ఈఓ చక్రధరరావుతో పండితులు పూజ చేయించి వ్రతాన్ని ప్రారంభించారు. పూజలో పాల్గొన్న వారందరికీ వరలక్ష్మీదేవి రూపు, పూజా సామగ్రిని దేవస్థానం సమకూర్చింది. అనంతరం పండితులు విఘ్నేశ్వరపూజ, కలశస్తాపన, కుంకుమ పూజల అనంతరం పురాణ వ్యాఖ్యానం నడుమ వరలక్ష్మీదేవి వ్రతం చేయించారు.