
వర్రీఫికేషన్
సాక్షి, అమలాపురం: కూటమి ప్రభుత్వ తీరుతో డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఎప్పుడు లేని విధంగా కొత్త విధానానికి తెరతీయడంతో వారిలో ఆందోళన అధికమవుతోంది. డీఎస్సీ స్కోర్ కార్డులను ఈ నెల 14న విడుదల చేశారు. అనంతరం వారం రోజులు గడుస్తున్నప్పటికీ నేటి వరకు మెరిట్ జాబితాను ఇవ్వలేదు. దాని కోసం అభ్యర్థులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మెరిట్ జాబితా ఇవ్వకుండా సెలెక్షన్ జాబితా ఇస్తారని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగులతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ గందరగోళానికి తెరదించాలని, మెరిట్ జాబితా ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఏం జరిగిందంటే..
డీఎస్సీ 2025 అభ్యర్థుల స్కోర్ కార్డులను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. స్కోర్ కార్డుల ఆధారంగా ఎవరికెన్ని మార్కులు వచ్చాయి? తమ మార్కులకు ఉద్యోగం వస్తుందా? రాదా? అంటూ అభ్యర్థులు ఆరా తీసుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కేటగిరీల కింద 1,241 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. స్కోర్ కార్డులు ఇచ్చినప్పటికీ మెరిట్ జాబితా ప్రకటిస్తేనే అభ్యర్థులకు ఊరట కలుగుతుంది. అయితే ఇంత వరకు ఆ దిశగా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. ఇదిలా ఉంటే డీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో ఎంపికై న అభ్యర్థులకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలో నిర్ణయించేందుకు ఖాళీల వివరాలను విద్యాశాఖ సేకరించింది. డీఈవో కార్యాలయాల ఐటీ విభాగం మండల విద్యాశాఖ అధికారుల ద్వారా వాస్తవంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, అత్యవసరంగా ఎక్కడ భర్తీ చేయాలనే విషయాలపై సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం.
25 టీమ్‌ల ఏర్పాటు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డీఎస్సీలో మెరిట్ కనబర్చిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దీనికోసం తూర్పుగోదావరి జిల్లాలో 25 టీములను నియమించింది. దీనిలో మండల విద్యాశాఖాధికారులు, ఐటీ సిబ్బంది ఉంటారు. సర్టిఫికెట్ల పరిశీలన చేసే విధానంపై టీమ్ సభ్యులకు బుధవారం విజయవాడలో పాఠశాల విద్యాశాఖ వర్క్‌షాపును నిర్వహించింది.
తెరపడేదెన్నడు?
డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఈ ఏడాది ఏప్రిల్ 20న విడుదలైంది. దరఖాస్తుకు మే 15 తుది గడువు, అనంతరం 63,004 దరఖాస్తులు వచ్చాయి. జూన్ 6 నుంచి జూలై 2 వరకూ పరీక్షలు జరిగాయి. ప్రైమరీ కీని జూలై 4న, అభ్యంతరాల అనంతరం ఫైనల్ కీని ఆగస్టు ఒకటిన విడుదల చేశారు. ఆగస్టు 14న స్కోర్ కార్డులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో నార్మలైజేషన్ మార్కులతో కలిపి ఇచ్చారు. ఇప్పుడు అభ్యర్థుల దృష్టి అంతా మెరిట్ జాబితాపైనే ఉంది. అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతో మెరిట్ జాబితా ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు.
డీఎస్సీ సర్వం గందరగోళం
నేటికీ ప్రకటించని మెరిట్ జాబితా
గతానికి భిన్నంగా డీఎస్సీ 2025
అయోమయంలో అభ్యర్థులు
స్కోర్ కార్డులు ప్రకటించిన అనంతరం మెరిట్ జాబితాను ప్రకటించాల్సి ఉంది
ఇంతవరకు మెరిట్ జాబితా ప్రకటన లేదు
అయోమయానికి గురవుతున్న అభ్యర్థులు
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు
సిద్ధమవుతున్న జిల్లా యంత్రాంగం
మెరిట్ జాబితా
రాకపోవడంతో అభ్యర్థుల ఆందోళన
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో
1,241 ఉపాధ్యాయ పోస్టులు
కూటమి తీరుతో
డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
మెరిట్ జాబితా కోసం ఎదురు చూపులు
ఇప్పటికీ విడుదల చేయని సర్కార్
పైగా సర్టిఫికెట్ల
వెరిఫికేషన్‌కు సిద్ధమంటూ వార్తలు