రాజమహేంద్రవరంలో వరద గోదావరి ఉధృతి
ధవళేశ్వరం: ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది. ఎగువ నుంచి కాటన్ బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇరిగేషన్ యంత్రాంగం అప్రమత్తమైంది. ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నీటి ఉధృతి వేగంగా పెరుగుతుంది. మరోపక్క గోదావరి ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పొంగి పొర్లుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద బుధవారం రాత్రి 10.60 అడుగులకు నీటి మట్టం చేరింది. మొత్తం 175 క్రస్ట్‌గేట్లను పూర్తిగా పైకిలేపి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. 8,28,331 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలారు. డెల్టా కాలువలకు సంబంధించి 4,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,000 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 1,300 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కుల నీటిని వదిలారు.
నేడు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి..
కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం ఉదయం ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటి మట్టం చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ యంత్రాంగం అంచనా వేస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 10 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల చేస్తూ 11.75 అడుగులకు నీటి మట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటిస్తారు. 13.75 అడుగులకు నీటి మట్టం చేరితే రెండవ ప్రమాద హెచ్చరికను, 17.75 అడుగులకు నీటి మట్టం చేరితే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు పడవల రాకపోకలను నిషేధిస్తారు.
ఎగువ ప్రాంతాల్లో ఇలా...
ఎగువ ప్రాంతాలకు సంబంధించి భద్రాచలంలో 47.40 అడుగులకు నీటి మట్టం చేరింది. భద్రాచలంలో ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. రాత్రి 10 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాళేశ్వరంలో 12.83 మీట ర్లు, పేరూరులో 17.48 మీటర్లు, దుమ్ముగూడెంలో 13.07 మీటర్లు, పోలవరంలో 13.78 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.55 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి.
లంకలను ముంచెత్తిన వరద
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): లంక ప్రాంతాల్లో నివసిస్తున్న వారు వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తారు. వర్షాకాలం మూడు నెలలు వీరికి కష్టకాలం అని చెప్పవచ్చు. చేపలు పట్టుకోవడం, లంకల్లో పశువుల పెంపకం వంటి పనులతో వీరంతా జీవనోపాధి పొందుతారు. వర్షాకాలంలో గోదావరికి వరద నీరు చేరడంతో వీరిని పునరావాస కేంద్రాలకు తరలించడం పరిపాటుగా మారింది. ఏటా వర్షాకాలంలో వీరిని రాజమహేంద్రవరంలోని పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. అక్కడే వీరికి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. వరద ఉధృతి తగ్గిన తరువాత వారంతా తిరిగి లంకల్లోకి వెళ్లతారు.
నేడు ధవళేశ్వరం వద్ద మొదటి
ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం
ఇరిగేషన్ యంత్రాంగం అప్రమత్తం
కాటన్ బ్యారేజీ నుంచి 8.28లక్షల
క్యూసెక్కుల మిగులు జలాల విడుదల
ఉగ్ర గోదావరి ఉరకలు