
రేపు సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతం
అన్నవరం: శ్రావణమాసం ఐదో శుక్రవారం సందర్భంగా సత్యదేవుని సన్నిధిన ‘సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతం’ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు ఈ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నిత్య కల్యాణ మండపంతోపాటు నాలుగు, ఐదో నంబర్ వ్రత మండపాలలో కూడా ఈ వ్రతాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మూడు మండపాలలో వ్రతాలు నిర్వహించిన తరువాత కూడా మహిళలు ఎక్కువగా ఉంటే ఉదయం పది గంటలకు రెండో బ్యాచ్‌లో కూడా ఈ వ్రతాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు
దరఖాస్తుల ఆహ్వానం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థల ఉపాధ్యాయులకు సంబంఽధించి 2025 జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ బుధవారం తెలిపారు. కనీసం 10 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా అనుభవం ఉండాలని, అర్హత ఉన్నవారు ఈ నెల 30వ తేదీలోగా జిల్లా విద్యాశాఖాఽధికారి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసి, తమకు అందజేయాలని సూచించారు.
పంపా కాలువ గండికి
తాత్కాలిక మరమ్మతులు
తుని రూరల్: తుని మండలం టి.తిమ్మాపురం సమీపంలో పంపా వరద కాలువకు పడిన గండిని ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. సోమవారం రాత్రి పంపా కాలువకు గండిపడిన విషయం తెలిసిందే. మంగళవారం నియోజకవర్గ ప్రత్యేక అధికారి కె.శ్రీధర్ గండిని పరిశీలించి విషయాన్ని కలెక్టర్ షణ్మోహన్‌కు తెలియజేశారు. కలెక్టర్ ఆదేశాలతో బుధవారం జేసీబీ సహాయంతో మట్టితో గండిని పూడ్చివేసినట్టు ఎంపీడీఓ కె.సాయి నవీన్ తెలిపారు. ఇసుక బస్తాలు తరలించేందుకు పరిసర ప్రాంతాలు అనుకూలంగా లేకపోవడంతో తాత్కాలిక మరమ్మతులను మట్టితో పూర్తి చేసినట్టు తెలిపారు. వాతావరణం అనుకూలించిన తర్వాత ఇసుక బస్తాలతో గట్టిను మరింత పటిష్ట పర్చనున్నట్టు తెలిపారు.
వాడపల్లి వెంకన్నకు
రూ.1.42 కోట్ల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామికి హుండీల ద్వారా రూ. 1,42,16,807 ఆదాయం వచ్చింది. దేవదాయ, ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు బుధవారం ఈ విషయం తెలిపారు. ఆలయంలోని హుండీలను 28 రోజుల అనంతరం దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో బుధవారం తెరిచి, ఆదాయాన్ని వసంత మండపంలో లెక్కించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.1,19,58,204, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ. 22,58,603 వచ్చిందని ఈఓ వివరించారు. అలాగే బంగారం 23 గ్రాములు, వెండి 670 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 46 వచ్చాయన్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ అధికారిగా ఏసీ అండ్ జిల్లా దేవదాయశాఖ అధికారి వి.సత్యనారాయణ, దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ టీవీఎస్ సార్ ప్రసాద్, జిల్లా దేవదాయశాఖ కార్యాలయ పర్యవేక్షకుడు డి.సతీష్ కుమా ర్, గోపాలపురం గ్రూపు దేవాలయాల ఈవో బి కిరణ్, దేవస్థానం సిబ్బంది అర్చకులు, శ్రీవారి సేవకులు పోలీసులు, కెనరా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.