
స్వామికి దయ కలిగింది!
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శానిటరీ సిబ్బందిపై సత్యనారాయణ స్వామి దయ చూపారు. సిబ్బంది జూన్, జూలై నెలల జీతాలు బుధవారం అందుకున్నారు. 350 మంది శానిటరీ సిబ్బంది బ్యాంకు ఖాతాలకు బుధవారం కనకదుర్గా మేన్‌పవర్ సంస్థ ద్వారా జీతాలు జమ అవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. విభాగాల వారీగా ఒక్కొక్కరు నెలకు రూ.10,500 నుంచి రూ.12,500 వరకు రెండు నెలల జీతాలు అందుకున్నారు. ఇందుకోసం రూ.1.18 కోట్ల మొత్తాన్ని దేవస్థానం బుధవారం ఆ కాంట్రాక్టర్ అకౌంట్‌కు జమ చేసిన ఐదు నిమిషాల్లోనే సిబ్బంది అకౌంట్‌లకు జీతాలు జమ అయ్యాయి.
ఈసారి కూడా సాక్షి చొరవతోనే...
గతంలో మాదిరిగానే ఈసారి కూడా సాక్షి చొరవతోనే సిబ్బందికి జీతాలు జమ అవడం విశేషం. సాక్షి దినపత్రికలో ఈ నెల 12వ తేదీన ‘స్వామీ...నీ దయ రాదా...!’ శీర్షికన వార్త ప్రచురితమైన తరువాత మాత్రమే జీతాల చెల్లింపు ప్రక్రియ వేగవంతమైంది. గతంలో మార్చి జీతాలు ఆలస్యమవడంతో అప్పట్లో సాక్షి దినపత్రికలో ఏప్రిల్ 25 వ తేదీన ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు స్వామీ’ అంటూ వార్త ప్రచురించడంతో ఏప్రిల్ 30న కార్మికుల అకౌంట్‌లో జీతాలు వేశారు. ఏప్రిల్ జీతాలు కూడా ఆలస్యం కావడంతో మే నెల 26న ‘వీరి కష్టం తుడిచేవారేరీ!’ శీర్షికన వార్త ప్రచురించడంతో దేవస్థానం అధికారులు స్పందించి జీతాలు చెల్లించారు. మే నెల జీతాలు కూడా జూన్ రెండో వారంలో చెల్లించారు.
రత్నగిరి శానిటరీ సిబ్బందికి జీతాల చెల్లింపు

స్వామికి దయ కలిగింది!