
వేద పఠనంతో పులకించిన కుమారారామం
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత చాళుక్య కుమారా రామభీమేశ్వరాలయం మంగళవారం వేద పఠనంతో పులకించింది. బాలాత్రిపుర సుందరి వేదశాస్త్ర పరిషత్తు ఆధ్వర్యంలో 27వ వేదసభను పంచారామ క్షేత్రంలో నిర్వహించారు. సీనియర్ వేద పండితులు శ్రీపాద రాజశేఖరశర్మ అధ్యక్షత వహించారు. పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాకు చెందిన వేద పండితులు పాల్గొన్నారు. దువ్వూరి సూర్యప్రకాశ చైనులు ఘనపాఠి, తంగిరాల సుబ్రహ్మణ్య సోమయాజులు ఘనపాఠి వేదాల ప్రాధాన్యాన్ని వివరించారు. తరుచూ వేద పారాయణ జరిగే ప్రాంతాలు ప్రగతి సాధిస్తాయని వారు తెలిపారు. సృష్టిలో ప్రతీ జీవికి వేదశాస్త్రం అనేక విధాల క్షేమకారిగా రక్షణ కలిగిస్తుందని వివరించారు. వేదాలను సరళమైన రీతిలో ప్రజలకు చేరువ చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలన్నారు. వేదసభలో పాల్గొన్న సుమారు 200 మంది వేద పండితులు హిందూ సంస్కృతి సంప్రదాయాలను వివరిస్తూ చతుర్వేద పారాయణ, వేదస్వస్తి చెప్పారు. వేద పండితులను ఘనంగా సత్కరించారు. ఈఓ బళ్ల నీలకంఠం, ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ కంటే బాబు, పారిశ్రామికవేత్త నలజర్ల కామేశ్వరరావు (పెదబాబు), భక్త సంఘం నాయకులు చుండ్రు గోపాలకృష్ణ, గంజి బూరయ్య, ఆర్వీ సుబ్బరాజు, బిక్కిన రంగనాయకులు, వేదశాస్త్ర పరిషత్తు కన్వీనర్ గ్రంధి సత్యరామకృష్ణ పండితులను సత్కరించారు. వేద పరిషత్తుకు సహకరించిన దాతలను సత్కరించారు.