
నాట్లు.. పాట్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించింది. మూడు రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న వర్షంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. భారీ వర్షాలతో పిఠాపురం బ్రాంచ్ కెనాల్, సుద్దగడ్డ, ఏలేరు, పంపా, తాండవ జలాశయాల్లోకి వచ్చి చేరిన నీరు మెట్ట ప్రాంతంలో ఆయకట్టు రైతులకు కాస్త ఊరటనిచ్చింది. అయితే డెల్టా ప్రాంతంలో వెదజల్లు సాగుచేపట్టిన పొలాలు ముంపులోకి వెళ్లాయి.
ముందు చూపు లేని సర్కారు
ముందు చూపు లేని సర్కారు తీరుతో పొలాలు ముంపులో ఉన్నాయి. ఖరీఫ్ నారుమళ్లు ముందుగా వేసుకుని నాట్లు ముందుగానే పూర్తి చేయాలని ప్రభుత్వం పిలుపు నిచ్చింది. దానికి తగినట్టు నీరు విడుదల చేయకపోవడంతో వరి నాట్లు జిల్లాలో ఆలస్యమయ్యాయి. ఫలితంగా మెజార్టీ రైతులు వెదజల్లుకు మొగ్గు చూపారు. పెద్దాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లోని డెల్టా ప్రాంతంలో ఇలా వెదజల్లు తో సాగుకు సమాయత్తమైన పంట పొలాలు ప్రస్తుత వర్షాలతో ముంపులో ఉన్నాయి. జిల్లాలో ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 2.10 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 70 శాతం అంటే 1.70 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జిల్లాలో అత్యధికంగా తొండంగి మండలంలో 55.02 మిల్లీమీటర్లు, అత్యల్పంగా పెదపూడి మండలంలో 22.04 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. కాకినాడ పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక సోమవారం కూడా కొనసాగింది.
పొంగి పొర్లుతున్న కాలువలు
పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో ఏలేరు, సుద్దగడ్డ తదితర ప్రధాన పంట కాలువలు పొంగి పొర్లుతుండడంతో పొలాలు నీట మునిగాయి. పిఠాపురం మండలం పి.తిమ్మాపురం, జములపల్లి, రాయవరం, రాపర్తి, గొల్లప్రోలు మండలం లక్ష్మీపురం, చేబ్రోలు, సీతానగరం తదితర గ్రామాల్లో వరితో పాటు పత్తి పంటలు నీట మునిగాయి. ఈ మండలాల్లో వాణిజ్య పంటలు ముంపులో ఉన్నాయని రైతులు దిగులు చెందుతున్నారు. ముఖ్యంగా వెదజల్లే పద్ధతిలో వేసిన వరి పూర్తిగా నీట మునిగి రైతులు ఆవేదన చెందుతున్నా రు. సుద్దగడ్డ కాలువ పొంగి ప్రవహిస్తుండడంతో గొల్లప్రోలు ఈబీసీ కాలనీ, కొత్త కాలనీ, సూరంపేట తదితర నివాస ప్రాంతాలు నీట మునిగాయి. ఏలేరు కాలువకు గత ఏడాది పడిన గండ్లు పూడ్చివేత పనులు వదిలేయడంతో నాట్లు వేసిన పొలాల్లోకి నీరు చేరిందని రైతులు చెబుతున్నారు.
పూడిక తీయక..
కాలువల్లోకి నీరు విడుదల చేసే చివరి నిమిషంలో పూడికతీత పనులు మొదలు పెట్టి అన్యాయం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో నీరు సక్రమంగా పారుదల కాక వరద నీరు పొలాల్లోకి వచ్చేస్తోందన్నారు. ముందుగా పూడిక తీత జరిగితే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదంటున్నారు. ప్రత్తిపాడు నియోజవర్గంలో సుమారు 24 వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ఏలేరు పరివాహక ప్రాంతంలో పడుతున్న వర్షాలతో ఏలేరుకు వరద ఉధృతి పెరిగింది. సోమవారం ఏలేరు ప్రాజెక్టులోకి 6,100 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. దీంతో వరద నీరు ప్రాజెక్టులోకి మరింత వస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి నీటి విడుదల తగ్గించేశారు. కేవలం అక్కడి నుంచి 525 క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 86.46 మీటర్లకు 79.00 మీటర్లు, 24.11 టీఎంసీలకు 12.31 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. ఇందులో విశాఖకు 200, తిమ్మరాజుచెరువుకు 20 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ఈ ప్రాంత ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేశారు.
అదనపు జలాల విడుదల
పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట మండలం వీకే రాయపురంలో పొలాలు నీట మునిగాయి. గోదావరి కాలువలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటి మట్టం పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని బిక్కవోలు, వేట్లపాలెం గ్రామాల వద్ద గోదావరి నుంచి అదనపు జలాలను విడిచిపెడుతున్నారు. అవి మురుగు కాలువ ద్వారా సముద్రంలో కలవాలి. వేట్లపాలెం వీఆర్ నుంచి వచ్చే అదనపు జలాలు వీకే రాయపురం పొలాల మీదుగా వెళ్లడంతో అవి మునిగిపోయాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పంట కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులతో పాటు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వేట్లపాలెం సర్ ప్లస్ వియర్స్ గేట్లు ఎత్తివేయడం వల్ల తరచూ తమ పంట పొలాలు నీటిలో మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలతో పెద్దాపురం, సామర్లకోట మండలాల్లోని దుంప, నువ్వులు సాగుకు సానుకూలమంటున్నారు.
సహాయక చర్యలు
గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలోని సుద్దగడ్డ కాలువకు వరద నీరు పోటెత్తడంతో గొల్లప్రోలు కొత్త కాలనీకి రాకపోకలు నిలిచాయి. ముందు జాగ్రత్త చర్యలుగా కాలనీలో ఉన్న ముగ్గురు గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలను బోట్లపై కాలువ దాటించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

నాట్లు.. పాట్లు