
రాజ్యాంగాన్ని అవమానించేలా కూటమి పాలన
కాకినాడ సిటీ: అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అవమానించే రీతిలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పాలన కొనసాగిస్తోందంటూ వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కాకినాడ కలెక్టరేట్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. రాజ్యాంగాన్ని అవమానపరిచే రీతిలో వ్యవహరిస్తూ విద్యార్థుల నుంచి విద్యార్థి సంఘాలను దూరం చేసే కుట్రకు తెరతీస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పూసల అనిల్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం సొంతంగా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని తయారు చేసుకుందన్నారు. విద్యాశాఖామంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులు ప్రశ్నించే గొంతులపై కత్తి మోపుతున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని, అన్యాయంగా జైల్లో నిర్బంధిస్తున్నారని నినాదాలు చేశారు. హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసేంత పరిస్థితికి దిగజారారని ధ్వజమెత్తారు. ఈ నిషేధం ద్వారా సంక్షేమ హాస్టళ్లన్నీ సమస్యల వలయంలో చిక్కి విలవిలలాడుతున్నాయని మంత్రి లోకేష్ ఒప్పుకున్నట్లే అన్నారు. విద్యార్థి సంఘం కాకినాడ సిటీ అధ్యక్షుడు జలగడుగుల పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఒక పక్క విద్యాసంస్థల్లో ర్యాగింగ్ కారణంగా అణగారిన వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, మరో పక్క మౌలిక వసతులు లేక సంక్షేమ హాస్టళ్లన్నీ సంక్షోభంలో కూరుకుపోయాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు గండ్రేటి వినీత్ కుమార్, బోన్‌లికిత్, మణికంఠ, నూతలపాటి రాజు, గన్నవరపు రాజేష్, కనిపే రవి, కంచుమర్తి నాగేశ్వరరావు, చింటూ, రాజేష్ పాల్గొన్నారు.
విద్యార్థులను విద్యార్థి సంఘాలకుదూరం చేసే కుట్ర
వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్
నాయకుల ధ్వజం
కాకినాడలో విద్యార్థులతో కలసి నిరసన