
ముగ్గురు బైక్ దొంగల అరెస్టు
● 34 వాహనాల స్వాధీనం
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ రమేష్ బాబు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మోటారు సైకిళ్లను దొంగిలిస్తున్న ముగ్గురిని త్రీటౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బైక్ దొంగలను చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ వివరాలను త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ కె.రమేష్ బాబు వివరించారు. మోటారు సైకిళ్ల దొంగతనాలు ఎక్కువైన నేపథ్యంలో త్రీటౌన్ సీఐ వి.అప్పారావు నేతృత్వంలో దొంగలపై నిఘా పెట్టారు. దీనిలో భాగంగా కాతేరు గామన్ బ్రిడ్జి వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో ఉండ్రాజవరం మండలం సత్యవాడలోని రామాలయం వీధికి చెందిన కుప్పాల రంగారావు, పసలపూడికి చెందిన గోపిరెడ్డి యోహాన్, అరుంధతిపేటకు చెందిన సిర్రా బంగారుబాబు రాజమహేంద్రవరం వైపు నుంచి వెంకటనగరం వైపు వెళుతున్నారు. ఆ ముగ్గురిని పోలీసులు ఆపి వాహనాల రికార్డులను అడిగారు. వారి వద్ద ఎటువంటి రికార్డులు లేకపోవడంతో అను మానం వచ్చి విచారణ చేశారు. దీంతో వారు అపహరించిన మోటారు సైకిళ్ల వివరాలను తెలిపారు. వీరిపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌తో పాటు భీమవరం, గుడివాడ, ఏలూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి 34 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బైక్ దొంగలను పట్టుకున్న సీఐ వి.అప్పారావు, ఎస్సై అప్పలరాజు, హెడ్ కానిస్టేబుల్ వి.కృష్ణ, ఎన్.వెంకట రామయ్య, కె.సురేష్, చంద్రశేఖర్, విజయ్‌కుమార్, మహేష్ పవన్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.